ఆశలు.. ఆలకిస్తారా

ABN , First Publish Date - 2022-08-10T05:58:12+05:30 IST

జిల్లాగా ఆవిర్భవించాక తొలిసారి సీఎం జగన్‌ గురువారం బాపట్లకు రానున్నారు. విద్యల కాణాచిగా వెలుగొందుతున్న బాపట్లలో విద్యాదీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ఆశలు.. ఆలకిస్తారా
బాపట్లలో వైద్య కళాశాల ప్రతిపాదిత స్థలం

ప్రతిపాదనల్లోనే సమీకృత కలెక్టరేట్‌ 

మొదలే కాని వైద్య కళాశాల పనులు

సీఎం జగన్‌ తొలిసారి రేపు బాపట్లకు రాక 

సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లనున్న ప్రజాప్రతినిధులు

ఊతమిస్తేనే నూతన జిల్లా మరింత పురోగమనం



బాపట్ల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాగా ఆవిర్భవించాక తొలిసారి సీఎం జగన్‌ గురువారం బాపట్లకు రానున్నారు. విద్యల కాణాచిగా వెలుగొందుతున్న బాపట్లలో విద్యాదీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. నూతన జిల్లాలో అపరిష్కృతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయా సమస్యలు ముఖ్యమంత్రి జగన్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. విద్య, వ్యవసాయ, పర్యాటక అభివృద్ధికి ఆస్కారమున్న జిల్లాకు ప్రభుత్వం ఊతమిస్తే అభివృద్ధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది. వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసి ఏడాది దాటినా ఇంతవరకు పనులు మొదలుకాలేదు. ఎప్పటి నుంచో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీ డిమాండ్‌ ఇంతవరకు నెరవేరలేదు. రైతులు ఎప్పటి నుంచో కోరుతున్న నల్లమడ వాగు ఆధునికీకరణ పనులు ఇంతవరకు కాగితాల దశ దాటలేదు. సూర్యలంకలో పర్యాటక రంగ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు జిల్లా ఏర్పాటయ్యాక పూర్తిస్థాయిలో సిబ్బంది కానీ, శాఖల విభజన జరగలేదు. దీంతో అటు ఉద్యోగులు ఇబ్బందులు పడడంతో  పాటు ఇటు జిల్లాకు రావాల్సిన ఆదాయం కోల్పోతుంది. చీరాల వస్త్రవ్యాపారంలో ఇప్పటికే మినీ ముంబయిగా వాసి కెక్కింది. అద్దంకి గ్రానైట్‌, పర్చూరు మిర్చి రైతులు ఇలా అన్ని రంగాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లాలో ఉన్న వనరుల దృష్ట్యా నిధుల సహకారం ఇస్తే కొద్దికాలంలోనే మిగతా జిల్లాల కన్నా అగ్రగామిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లా ఆవిర్భవించాక తొలిసారి జిల్లాకు ముఖ్యమంత్రి రానుండడంతో అటు నేతలు, ఇటు ప్రజలు తమ ఆశలను ఆలకించి వరాల జల్లు కురిపిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి బాపట్ల పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హెలిప్యాడ్‌లో నాయకులతో కలిసే సమయంలో కాని వేదికపై మాట్లాడే అవకాశం వస్తే కోరికల చిట్టాను సీఎం ముందుంచడానికి ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.   


ప్రధాన సమస్యలు ఇవే..

- చీరాల ఓడరేవులో ఫిష్షింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో తొలి అడుగులు పడ్డాయి. దాదాపు రూ.419 కోట్లతో డీపీఆర్‌లను సైతం అప్పటి ప్రభుత్వం రూపొందించింది. 

- నిజాంపట్నం పోర్టు విస్తరణపై  దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

నల్లమడ వాగు ఆధునికీకరణ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆయకట్టు రైతులకు అత్యవసరం. అయితే ఇంతవరకు నిధుల మంజూరు ఊసేలేదు. 

- గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పరిధిలోని కొన్ని ముంపు గ్రామాలు జిల్లా పరిధిలోకి వచ్చాయి. వారికి పునరావాసం, పరిహారం విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదు.

- దాదాపు 5,000 ఎకరాలకు నీరందించే కొరిశపాడు ఎత్తిపోతల పఽథకం, భవనాసి రిజర్వాయర్‌ పనుల విషయంలో కూడా కదలికి లేదు. 

- సూర్యలంకలో పర్యాటక రంగ అభివృద్ధికి  అన్ని రకాలుగా అవకాశం ఉంది. కానీ సమగ్ర ప్రతిపాదనలతో వాటిని పట్టాలెక్కించే విధంగా ప్రభుత్వం కృషి చేయలేదు. దీంతో ఆదాయాన్ని జిల్లా కోల్పోతోంది.

జిల్లా కేంద్రం అయినా దృష్ట్యా తాగునీటి అవసరాలు పెరిగాయి. దానికి తగ్గట్లు రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది.

- విద్యల కాణాచిగా బాపట్లకు ఖ్యాతి ఉంది.  కొంచెం ఊతమిస్తే రాష్ట్రంలోనే ఎడ్యుకేషనల్‌ హబ్‌గా బాపట్ల విరాజిల్లే అవకాశం ఉంది. ఇక్కడ వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల జరిగిన ప్లీనరీలో కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తావించారు. 

- బాపట్లలో 500 పడకల ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలకు శంకుస్థాపన జరిగి ఏడాది దాటింది. అయినా పనులలో పురోగతి లేదు. నూతన జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఆస్పత్రి కూడా పూర్తిహంగులతో లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిదానికి ఇటు గుంటూరు కాని అటు ఒంగోలు కాని పోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. 

- జిల్లా ఏర్పడి నాలుగు నెలలు దాటినా ఉద్యోగులకు పాలనా కష్టాలు తప్పడం లేదు. అప్పట్లో ప్రకటించిన సమీకృత కలెక్టరేట్‌ ఇంకా కార్యరూపం దాల్చలేదు.

- జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేరు. కీలకమైన కొన్ని శాఖలు ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కొనసాగుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు కార్యాలయాలు లేవు. ఆదాయ అవకాశం ఉన్న గనుల శాఖ విభజన కూడా ఇంకా జరగలేదు.


 ముఖ్యమంత్రి పర్యటన ఇలా....

గురువారం ఉదయం 9.35కి తాడేపల్లిలో బయల్దేరనున్న సీఎం జగన్‌ 10.10కి బాపట్ల చేరుకోనున్నారు. 20 నిమిషాల వ్యవధిలో సభా ప్రాంగణమైన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకుని విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విద్యాదీవెన సాయం విడుదల చేసిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి బయల్దేరతారని అధికారిక సమాచారం.


Updated Date - 2022-08-10T05:58:12+05:30 IST