ఏపీలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-11T18:31:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఏపీలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని చెప్పారు. తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, కావలి, ప.గో. జిల్లా ఏలూరులో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం అమలవుతుందన్నారు. 


రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం అమలవుతుందని సీఎం తెలిపారు. వార్షిక ఆదాయం  రూ.18 లక్షల వరకు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించినట్లు చెప్పారు. కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. అవసరం మేరకు 150. 200, 240 గజాల స్థలం ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.


మొత్తం సొమ్ము నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లు అందజేయడం జరుగుతుందన్నారు. పదిశాతం ముందుగా చెల్లిస్తే ఇంటి నిర్మాణం చేస్తామన్నారు. వాయిదాల్లో మిగతా సొమ్ము చెల్లింపు చేయవచ్చునన్నారు. అయితే డబ్బులు మొత్తం ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేట్‌ కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-11T18:31:42+05:30 IST