నేడు సీఎం జగన్‌ రాక

ABN , First Publish Date - 2022-08-11T05:19:22+05:30 IST

జగనన్న విద్యాదీవెన మూడో విడత సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం బాపట్లకు రానున్నారు.

నేడు సీఎం జగన్‌ రాక
సభా వేదిక

విద్యాదీవెన మూడో విడత పంపిణీ

బాపట్ల ఆర్ట్స్‌ కళాశాల వేదికగా సభ

1560 మంది పోలీసులతో బందోబస్తు

హాజరు కావాలని డ్వాక్రా గ్రూపులకు ఆదేశం


బాపట్ల/బాపట్ల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యాదీవెన మూడో విడత సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం బాపట్లకు రానున్నారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. బాపట్ల జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారి సీఎం రానుండడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. వారం నుంచి జరుగుతున్న ఏర్పాట్లు బుధవారం సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే పార్కింగ్‌, వాహనాల మళ్లింపు, సభావేదికగా వెళ్లే దారులు అన్నింటిని గుర్తించారు. బుధవారం హెలిప్యాడ్‌తో పాటు సభాప్రాంగణాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, చీరాల వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ పరిశీలించారు. డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలను సభకు తరలిరావాలని ఆదేశించినట్లు సమాచారం. సీఎం సభకు వారిని తరలించడానికి యానిమేటర్లకు లక్ష్యాన్ని విధించినట్లు తెలుస్తోంది. సమావేశానికి రాకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని వారికి చెబుతున్నట్లు డ్వాక్రామహిళలు చెబుతున్నారు.   


ముఖ్యమంత్రి సభకు పటిష్ఠ బందోబస్తు 

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అస్కారం లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. కార్యక్రమానికి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వాహనాలను దారిమళ్లించామన్నారు. కాన్వాయ్‌ ట్రయిల్‌రన్‌ను ఎస్పీ పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తిఅయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. దాదాపు 1560 మంది పోలీసులతో సభకు భద్రత కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 34 మంది సీఐలు, 113 మంది ఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ పి.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్మోహనరెడ్డి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.10 సమయంలో బాపట్లకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10.35కి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్థానిక నాయకుల ప్రసంగాల అనంతరం విద్యాదీవెన లబ్ధిదారులతో సీఎం మాట్లాడతారు. పన్నెండు గంటల సమయంలో విద్యాదీవెన సాయాన్ని బటన్‌నొక్కి విడుదల చేయనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. 


వాహనాల దారి మళ్లింపు ఇలా..

చెరుకుపల్లి, కర్లపాలెం నుంచి బాపట్ల మీదగా చీరాల వైపు వెళ్లే వాహనాలు నందిరాజు తోట వద్ద బైక్‌ షోరూమ్‌ జంక్షన్‌ నుంచి బైపాస్‌ రోడ్డు మీదగా వెళ్లాలని సూచించారు. చీరాల నుంచి బాపట్ల మీదగా గుంటూరు వెళ్లే వాహనాలు పొన్నూరు నుంచి బాపట్ల మీదగా చీరాల వెళ్లే వాటి విషయంలో ఎలాంటి మార్పులేదు. వీవీఐపీ, వీఐపీ వాహనాలకు బాపట్ల పబ్లిక్‌ స్కూల్‌ ఎదురు ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.  ఇతర వాహనాలకు కొత్త బస్టాండ్‌  దాటాక ఉన్న ఏబీఎం కాంపౌండ్‌ స్థలాన్ని ఎంపిక చేశారు. ద్విచక్రవాహనాలకు పాత బస్టాండ్‌ సమీపంలోని ఏబీఎం ఉన్నతపాఠశాల, మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రాంగణాన్ని గుర్తించారు. ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల, మార్కెట్‌యార్డులో కూడా పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.


సమస్యలు ఉత్పన్నం కాకూడదు : కలెక్టర్‌  

ముఖ్యమంత్రి సభా ప్రాంగణంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సభా వేదిక వద్ద అధికారులు, సిబ్బందితో ఆమె మాట్లాడారు. కలెక్టరేట్‌లో సమావేశమై అధికారులకు సూచనలు చేశారు. సభను జయప్రదం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, మత్స్యశాఖ జేడీ డాక్టర్‌ పి.సురేష్‌, బీసీ సంక్షేమశాఖాధికారి కల్పన, కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ తదితరులు ఉన్నారు. 


   

Updated Date - 2022-08-11T05:19:22+05:30 IST