Abn logo
Jul 1 2021 @ 21:32PM

జలవివాదంపై ప్రధాని, జలశక్తి మంత్రికి జగన్ లే‌ఖ

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదంపై  ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి గజేంద్రషెకావత్‌కు ఏపీ సీఎం జగన్ లే‌ఖ రాశారు. ప్రధానికి 14 పేజీల లేఖను జగన్‌ రాసారు. శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్‌ తయారీ, నీటి వినియోగంపై ప్రధానికి జగన్‌ వివరించారు. కేఆర్‌ఎంబీకి తాము ఫిర్యాదు చేయటం, శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని లేఖలో జగన్‌ పేర్కొన్నారు. గత నెల 23, 24న రెండు లేఖలు రాశామని జగన్‌ గుర్తు చేశారు. నాగార్జున సాగర్‌లో కూడా తక్కువ నీటి మట్టం ఉన్నా జలవిద్యుత్‌ ఉత్పాదనకు ప్రయత్నిస్తున్నారని లేఖలో జగన్‌ ఆరోపించారు. 

పులిచింతలలో కూడా కనీసం నీటిమట్టం ఉన్న సమయంలో విద్యుత్‌ ఉత్పాదన చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై జూన్‌ 30న కేఆర్‌ఎంబీకి లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయన్నారు.  హైడల్‌ ప్రాజెక్టు్లో పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పాదనకు నీటిని వినియోగించాలంటూ తెలంగాణప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో అంతర్రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలైన సీఐఎస్‌ఎఫ్ రక్షణ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని జగన్‌ కోరారు. 


క్రైమ్ మరిన్ని...