26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం: జగన్

ABN , First Publish Date - 2021-08-15T15:49:19+05:30 IST

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం: జగన్

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం దేశప్రజలందరికీ  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రాజకీయంగా మరింత సాధికారిత సాధించాలన్నారు. 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో రూ.83వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చెప్పారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామన్నారు. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 61 లక్షల మందికి అండగా నిలిచామని జగన్  చెప్పారు. ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.1,039 కోట్లు చెల్లించామని, పేద రైతులందరికీ నవరత్న పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30వేల శాశ్వత ఉద్యోగాలిచ్చామన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అనేక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామని, ప్రతి ఒక్కరూ డిగ్రీ లేదా సాంకేతిక విద్య పొందాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జగనన్న గోరుముద్ద ద్వారా 36 లక్షల మందికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నామని అన్నారు. పిల్లల చదువులకు ఇప్పటి వరకు రూ.26వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-15T15:49:19+05:30 IST