ముఖ్యమంత్రి గారూ.. ఆదుకోండి

ABN , First Publish Date - 2020-04-03T14:49:29+05:30 IST

‘నా పేరు తటుకూరి రమణ. మాది..

ముఖ్యమంత్రి గారూ.. ఆదుకోండి

ఓ నిరుపేద ఆవేదన


విజయవాడ, ఆంధ్రజ్యోతి: ‘నా పేరు తటుకూరి రమణ. మాది కృష్ణా జిల్లా తోట్లవల్లూరు. మాది పేద కుటుంబం. నిండు గర్భిణిగా ఉన్న నా భార్యను సమీపంలోని స్వస్థ్‌ ఆసుపత్రిలో చూపించేవాడిని. ఏడో నెల మధ్యలో ఒకరోజు అర్ధరాత్రి బ్లీడింగ్‌ అవుతుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. తీరా ఇక్కడికి వచ్చాక వెంటనే ఆపరేషన్‌ చేయాలని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఇక్కడి వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌, జర్నలిస్టు కార్డులు వంటివేవీ ఇక్కడ పనిచేయవని, వైద్యానికి, మందులకు డబ్బులు చెల్లించాలని చెప్పారు.


తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యాక బిల్లులు పెట్టుకుని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరు చేయించుకోవాలని చెప్పారు. తలకుమించిన భారమైనా భార్య, బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఆపరేషన్‌కు అంగీకరించాను. జనవరి 18న మాకు పాప పుట్టింది. ఏడో నెలలోనే ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయడం..700 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో బిడ్డను ఇంక్యుబేటరులో పెట్టారు. మా వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రి ఫీజులు, మందులకు కలిపి దాదాపు రూ. 12 లక్షల వరకు చెల్లించాను. ఇంకా రూ. 12 లక్షలు ఆసుపత్రికి కట్టాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ఎక్కడా అప్పు పుట్టడం లేదు.


మా ఇంటిని తనఖా పెట్టో.. లేకపోతే అమ్మేసో డబ్బులు సమకూర్చుకుందామన్నా అవకాశం లేదు. డబ్బు కట్టకపోతే క్రిమినల్‌ కేసు పెట్టి జైలుకు పంపుతామని ఆసుపత్రి వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగనే మమ్మల్ని ఆదుకోవాలి’ అంటూ రమణ ప్రాధేయ పడుతున్నాడు. తనలాంటి పేదలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీగా భావించి పేదలను ఆదుకోవాలని ఆయన కోరాడు. 

Updated Date - 2020-04-03T14:49:29+05:30 IST