ల్యాప్‌టాప్‌ పోయి.. ట్యాబ్‌ వచ్చే..! ఆదిలోనే ఆగిన ఆర్భాటపు పథకం

ABN , First Publish Date - 2022-06-28T19:49:56+05:30 IST

విద్యార్థులకు ల్యాప్‌టా‌ప్‌లు ఇస్తామని సీఎం జగన్‌ ఆర్భాటంగా చేసిన ప్రకటనపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఆదిలోనే హంసపాదులాగా ఒక్క ఏడాది కూడా విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు ఇవ్వకుండానే ఆ పథకానికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది...

ల్యాప్‌టాప్‌ పోయి.. ట్యాబ్‌ వచ్చే..! ఆదిలోనే ఆగిన ఆర్భాటపు పథకం

దాని ప్రస్తావన లేకుండా ‘అమ్మఒడి’ 

ఇస్తే ప్రభుత్వంపై 900 కోట్ల భారం

8వ తరగతికి ట్యాబ్‌లంటూ ప్రకటన


అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ల్యాప్‌టా‌ప్‌లు ఇస్తామని సీఎం జగన్‌ ఆర్భాటంగా చేసిన ప్రకటనపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఆదిలోనే హంసపాదులాగా ఒక్క ఏడాది కూడా విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు ఇవ్వకుండానే ఆ పథకానికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్న హామీని విస్మరించి, ప్రభుత్వం ఇప్పుడు ట్యాబ్‌లు ఇస్తామంటూ కొత్త హడావిడి మొదలు పెట్టింది. 9, 10, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు ఇస్తామని గతేడాది సీఎం జగన్‌ ఓ బహిరంగ సభలో ప్రకటన చేశారు. అమ్మఒడి వద్దనుకున్న వారికి బదులుగా వాటిని ఇవ్వబోతున్నామని, ఇదొక గొప్ప పథకమని ఇవ్వకముందే స్వీయ ప్రశంసలు చేసుకున్నారు. గతంలో ఇలాంటి ఆలోచనైనా చేశారా అంటూ ప్రతిపక్షాలపై విమర్శలూ చేశారు. సీఎం అంత ఆర్భాటంగా ప్రకటించడంతో ఒక ఏడాది అమ్మఒడి వద్దనుకుంటే తమ చేతుల్లో ల్యాప్‌టా్‌పలు ఉంటాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మురిసిపోయారు. తీరా అమలులోకి వచ్చేసరికి ఆర్భాటంగా ప్రకటించిన సీఎంగానీ, ప్రభుత్వంగానీ ల్యాప్‌టా్‌పల మాటే ఎత్తలేదు. అసలు అదొక పథకం ఉందా? ఆ హామీ ఇచ్చామా? అన్నట్టుగా అమ్మఒడి నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రస్తావన కూడా చేయలేదు. దీంతో ల్యాప్‌టా్‌పలు కావాలని ఆశపడి, ఆ ఆప్షన్‌ ఎంచుకున్న 8,21,655 మంది ఆశలు ఆవిరయ్యాయి.


చివరికి ఎప్పటిలాగే అమ్మఒడి నగదు తీసుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు ఇవ్వకపోయినా కనీసం వచ్చే సంవత్సరం అయినా ల్యాప్‌టా్‌పలు ఇస్తారేమోనని విద్యార్థులు అలాగే ఉంచుకున్న ఆశలపైనా ప్రభుత్వం దాదాపుగా నీళ్లు చల్లినట్లుగా తెలిసింది. ఈ సంవత్సరం సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. డిజిటల్‌ పాఠ్యాంశాల కంటెంట్‌తో ఈ ట్యాబ్‌లు విద్యార్థులకు అందజేస్తారు. అవే ట్యాబ్‌లను తర్వాతి తరగతులకు కూడా వినియోగించుకోవాలి. అలాంటప్పుడు వారు 9వ తరగతిలోకి వచ్చాక మళ్లీ ల్యాప్‌టాప్‌ ఇస్తారా? అనేది సందేహంగా మారింది. ఒకే విద్యార్థికి ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ రెండూ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అంటే ఇక ల్యాప్‌టా్‌పల పథకం నుంచి దాదాపుగా వెనక్కి తగ్గినట్లేననే వాదన వినిపిస్తోంది. అధికార వర్గాలు కూడా ప్రస్తుతానికి ల్యాప్‌టా్‌పల పంపిణీ ఆలోచనను ఉపసంహరించుకున్నామని చెబుతున్నాయి.


ఎందుకు ఇవ్వలేకపోయారు?

ధర అధికంగా ఉండటం వల్లే ఈ పథకంపై వెనక్కి తగ్గినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలుత ల్యాప్‌టాప్‌ల కొనుగోలు బాధ్యతను ఏపీ టెక్నలాజికల్‌ సర్వీసెస్(ఏపీటీఎస్)కు అప్పగించారు. పలు సంస్థలతో చర్చించిన ఏపీటీఎస్‌ రూ.18వేల చొప్పున ఇవ్వాలని అడిగింది. కానీ ప్రస్తుతం ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో రూ.26వేల కంటే తక్కువకు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చేశాయి. అమ్మఒడి పథకంలో తల్లులకు ఇచ్చే రూ. 13వేలు నగదుతో ల్యాప్‌టా్‌పలుఇవ్వాలని ప్రయత్నించిన ప్రభుత్వం అది సాధ్యంకాకపోవడంతో దాన్ని అమలుచేయలేదు. ఒకవేళ 8.21లక్షల మందికి ల్యాప్‌టా్‌పలు ఇచ్చుంటే ప్రభుత్వంపై అదనపు భారం రూ.900కోట్లకు పైగా పడేది. ఆ భారం భరించడం ఇష్టంలేకే  ఈ హామీకి మంగళం పాడేశారు. మరోవైపు ఇప్పుడు ట్యాబ్‌లు తీసుకునేవారికి వచ్చే ఏడాది అమ్మఒడి నగదుతో ముడిపెడతారా? అనే అనుమానాలున్నాయి. ట్యాబ్‌ ధర రూ. ఆరు వేలు నుంచి మొదలవుతోంది. ఇప్పటికే అమ్మఒడికి 15వేలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని 13వేలకు తగ్గించిన ప్రభుత్వం ఇలా ఆలోచన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో ట్యాబ్‌ ధరను అమ్మఒడిలో కట్‌ చేసుకునే ప్రతిపాదన పెడతారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-06-28T19:49:56+05:30 IST