Abn logo
May 6 2021 @ 17:25PM

ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు ఉచిత చికిత్స : సీఎం జగన్

అమరావతి : కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లను ఇవ్వాలని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని సూచించారు.

 కోవిడ్ ఆస్పత్రుల వద్దే కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో ఉన్న సీసీసీలను ఏర్పాటు చేయాలని జగన్ పేర్కొన్నారు. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో కూడా సేవలందించాలని తెలిపారు. కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌కేర్‌తో పాటు వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. తగినంత ఆక్సీజన్ సరఫరా, నిల్వల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, కేంద్రం కేటాయింపుతో పాటు ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి నిలపాలన్నారు. టీచింగ్ ఆస్పత్రుల వద్ద 10 కెఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ ఆక్సిజన్‌ నిల్వలుండాలని, వీలైనంత త్వరగా ఈ ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  

Advertisement