ఏం ఉద్ధరించారని రైతు దినోత్సవం?

ABN , First Publish Date - 2020-07-08T06:23:50+05:30 IST

జగన్‌ ప్రభుత్వం తన చేతగానితనంతో రైతులను కష్టాల సుడిగుండంలోకి నెట్టివేయడమే కాక, ఇప్పుడు రైతు దినోత్సవం పేరుతో సంబరాలు జరపడం హేయం.

ఏం ఉద్ధరించారని రైతు దినోత్సవం?

జగన్‌ ప్రభుత్వం తన చేతగానితనంతో రైతులను కష్టాల సుడిగుండంలోకి నెట్టివేయడమే కాక, ఇప్పుడు రైతు దినోత్సవం పేరుతో సంబరాలు జరపడం హేయం. ఆగిపోయిన ప్రాజెక్టుల పనులను రాబోయే రోజుల్లోనైనా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, వివిధ పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని కోరుతున్నాం.


వైఎస్రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా వైసీపీ ప్రభుత్వం జరపడం విడ్డూరం. సాగును ఎవరూ బాగు చెయ్యలేని విధంగా నాశనం చేసిందే అప్పటి వైఎస్ ప్రభుత్వం. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‍లో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది వైఎస్ హయాంలోనే. వారి ఐదున్నరేళ్ల పరిపాలనలో 14వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. 99 సెజ్‍లు ఏర్పాటు చేసి 2 లక్షల ఎకరాల భూములను గుంజుకొని రైతుల సమాధుల పైనే తన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకొన్న జగన్ నేడు రైతుల పట్ల దయామయులుగా జగన్నాటకాలు ఆడుతున్నారు. ముదిగొండ, కాకరాపల్లి, సోంపల్లిలో కాల్పులు జరిపి 15మంది రైతులను పొట్టన పెట్టుకొన్న విధానాన్ని, మిగులుజలాలపై హక్కులు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‍కు లేఖలు ఇచ్చి రాయలసీమ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసిన విధానాన్ని రైతుదినోత్సవం ద్వారా ప్రజలకు మరొక్కసారి గుర్తు చేస్తారా? రైతు బతుకులకు బీటలు బార్చిన వారే రైతు దినోత్సవాలు జరపడం విడ్డూరంగా వుంది.


వ్యవసాయరంగాన్ని, రైతు శ్రేయస్సును విస్మరించింది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయమే 62 శాతం ప్రజలకు జీవనాధారం. అలాంటి వ్యవసాయానికి కీలకమైన సాగునీటి రంగానికి బడ్జెట్లో కోతలు విధిస్తే రైతాంగం మనుగడ ఏం కావాలి? సాగునీటి రంగాన్ని పడుకోబెట్టిన ప్రభుత్వానికి రైతు దినోత్సవాలు నిర్వహించే అర్హత వున్నదా? అనేక ఆరోపణలు ఎదుర్కొని కూడా చంద్రబాబు పట్టుబట్టి పట్టిసీమను పూర్తి చెయ్యబట్టి ఆరేళ్లుగా డెల్టా బతుకుతుంది. ఆరేళ్లుగా గోదావరి డెల్టాతో సమానంగా కృష్ణా డెల్టా రైతులు జూన్‍లోనే ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.


వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైతు సమస్యల పట్ల ఉదారంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేపిటల్ ఎక్స్‌పెండిచర్ 2018–-19లో రూ.277కోట్ల నుంచి, 2019---–-20లో రూ.197కోట్లకు తగ్గించడాన్ని బట్టి వ్యవసాయం రంగంపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుంది. వ్యవసాయంపై మొత్తం వ్యయాన్ని (రెవిన్యూ + కేపిటల్ ఎక్స్‌పెండిచర్) రూ.9,869కోట్ల నుంచి రూ.7,024కోట్లకు తగ్గించారు. వ్యవసాయంలో జిఎస్‍డిపి వృద్ధిని 2018-19లో 3.84%గా చూపించి, 2019-–20లో 8.6%గా చూపడం అంతా మోసం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టే విభజన తర్వాత ఏపీ వ్యవసాయ రంగం అభివృద్ధి గణనీయంగా పెరిగింది. ఈ అభివృద్ధి రాష్ట్ర విభజన తర్వాతే సాధ్యం అయ్యింది. అందులో భాగంగానే రాష్ట్ర జిఎస్‍డిపికి వ్యవసాయం వాటా 2014-–15లో 30.4% నుంచి, 2019–-20కి 36.4%కు పెరిగింది. ఈ వృద్ధి అటు సేవారంగంలో, పారిశ్రామిక రంగంలో రాబడిని ప్రభావితం చేసింది. సేవా రంగం, పారిశ్రామిక రంగాల నుంచి ప్రాథమిక రంగం వ్యవసాయానికి పరివర్తన చెందడం వల్ల ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గడమే కాకుండా రాష్ట్ర రాబడిలో వృద్ధి ఉండదు. దీనితో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంది. 2017-–18లో ఉద్యాన రంగంలో వృద్ధి 13.62% నుంచి 2019–-20 రివైజ్డ్ అంచనాల్లో 11.67%కు తగ్గిపోయింది. ఆక్వా కల్చరులో వృద్ధి 2017–-18లో 33.7% నుంచి, 2019-20కు 5.5%కు తగ్గిపోయింది(కరోనా ప్రారంభం కాకముందే).


పశు సంవర్ధక రంగంలో వృద్ధి 2017–-18లో 11.93%ఉంటే, 2019-–20కు 4.5%కు పడిపోయింది. రాష్ట్రాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం ఉండే పశు సంవర్ధక, మత్స్యరంగాలలో వెనుకంజతో ఏపీ అభివృద్ధికి గండిపడింది. ఈ రంగాలలో స్వయం ఉపాధిని దెబ్బతీశారు. ఎగుమతులు తగ్గడం వల్ల విదేశీ మారకంలో ఆంధ్రప్రదేశ్ వాటా తగ్గిపోయింది. ట్రేడ్ డెఫిసిట్‌పై ప్రభావం పడుతుంది. ఆ ఫలితంగానే ఏపీ రెండంకెల వృద్ధిరేటు 11.02% నుంచి 8.16 శాతానికి పడిపోయింది. వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో వ్యవసాయం అనుబంధ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాల్లో వృద్ధి సాధించలేకపోవడమే కాకుండా, బడ్జెట్ నిధులు కూడా ఖర్చుపెట్టలేకపోవడం ఘోర వైఫల్యం. అన్నదాత సుఖీభవ పథకానికి టీడీపీ ప్రభుత్వం 2019–-20ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించింది. మరో రూ.10వేల కోట్లు వాగ్దానం చేసింది. 2019–-20 పూర్తి బడ్జెట్టుకు ఈ పథకానికి రూ.15వేల కోట్ల ఖర్చుకు సిద్ధం అయ్యింది. వైసీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతుభరోసా పథకాన్ని తెచ్చిందేగాని అందులో కొత్తదనమేమీ లేదు. 2019–-20లో ఈ పథకానికి కేవలం రూ.8,750కోట్లు కేటాయించింది, కేంద్రం ఇచ్చేవాటితో సహా. కానీ వాగ్దానం చేసింది మాత్రం రూ.13వేలకోట్లు. కానీ 2020-–21బడ్జెట్లో రూ.3,615కోట్లు మాత్రమే కేటాయించారు. రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలేవీ తేకపోగా, ఉన్న టీడీపీ పథకాలను రద్దు చేసి రైతు ప్రయోజనాలను దెబ్బతీసింది.


వైసీపీ ఏడాది పాలనలో విత్తనాలు, ఎరువులు సక్రమంగా పంపిణీ చేసిన దాఖలాలు లేవు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంకు గత ఏడాది రూ.3వేల కోట్లు కేటాయించినట్లుగా చెప్పడమే తప్ప ఆచరణలో చేసింది శూన్యం. గోడౌన్ల సామర్థ్యం పెంచే ప్రయత్నాలు చేయలేదు. ఒక్క టన్ను నిల్వ సామర్థ్యం కూడా పెంచలేకపోయారు. మార్కెట్టులో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరగాని, కనీస మద్దతు ధరగాని లభించలేదనేదు అనడానికి హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యుపిఐ) శూన్యత నిదర్శనం. కానీ రిటైల్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ)పై ఇన్‍ఫ్లేషన్ 6.5% వృద్ధి చెందడం చూస్తుంటే రైతులను దోచుకుని దళారులు ఏవిధంగా జేబులు నింపుకున్నారో తెలుస్తుంది. వ్యవసాయ రంగాన్ని దారుణంగా నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రాభివృద్ధి డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ (8.16%)కు పడిపోయింది. నీటిపారుదల ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులలో కేపిటల్ ఎక్స్‌పెండిచర్ 2018---–19లో 13,384కోట్లు (అకౌంట్స్) నుంచి, 2019–-20లో రూ.4,346కోట్లకు (రివైజ్డ్ ఎస్టిమేట్స్) కుదించారు. ఆయకట్టు కల్పించలేక పోయారు, నీటిపారుదల సామర్థ్యం ఏమాత్రం పెంచలేక పోయారు. రూ.9,038కోట్లు తగ్గిపోవడం, 67% ఖర్చు చేయలేకపోవడం వైసీపీ వైఫల్యాలకు నిదర్శనం. రిజర్వాయర్లలో నీటి నిర్వహణలోనూ, చెరువులు నింపడంలోనూ ఘోరంగా విఫలం అయ్యారు. చంద్రబాబు ఇంటిని ముంచడంపై పెట్టే శ్రద్ధలో పదోవంతు రైతులకు నీళ్లు ఇవ్వడంలో చూపిస్తే ఈ దుస్థితి వాటిల్లేది కాదు. టీడీపీ హయాంలో 5ఏళ్లలో 23ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి రైతులకు అంకితం చేశాం. మరో 40ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నరేగా నిధులను వ్యవసాయ పనులకు అనుసంధానం చేశాం. 8లక్షల పంట కుంటలను తవ్వి భూగర్భ జలాలు పెంచేందుకు దోహదపడ్డాం. నీరు-చెట్టు, నీరు-ప్రగతి, జలసిరికి హారతి తదితర అనేక చర్యల ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేశాం. అలాంటిది గత ఏడాదిగా ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారు, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాభివృద్ధినే రివర్స్ చేశారు. రైతుల కోసం టీడీపీ తెచ్చిన అన్నదాత సుఖీభవ, రైతురథం తదితర పథకాలు అన్నింటినీ రద్దు చేశారు.


బడ్జెట్టులో 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చి అమలులో మాత్రం 54 లక్షలకు కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 3 లక్షలకు తగ్గించారు. ఆచరణలో 30వేల మందికి కూడా ఇవ్వలేదు. రైతులకు ఒకే దఫాలో రూ.12,500 ఇస్తామని 2017లో జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రకటించారు. అంటే రాష్ట్ర నిధుల నుండే ఇస్తానని హామీనిచ్చారు. 2017 నాటికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ రూ.6వేలు ప్రకటించలేదు. అధికారంలోకి వచ్చాక రూ.1,000 పెంచి రూ.13,500 ఇస్తామన్నారు. హామీపై నిలబడే వారైతే ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రూ.6వేలతో పాటు రాష్ట్రం నుండి రూ.13,500 మొత్తం రూ.19,500 వేలు ఇవ్వాలి. అలాంటిది రూ.19,500కి బదులు రూ.13,500 ఇస్తామంటూ రూ.6 వేలు ఒక్కొక్క రైతుకు ఎగనామం పెడుతున్నారు.


రైతు రుణమాఫీ రూ.1,50,000ను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారా.. అని టీడీపీని గతంలో విమర్శించిన జగన్మోహన్ రెడ్డి, తమ రైతు భరోసా ఒకే విడతలో పూర్తిచేస్తామని ఉదరగొట్టి చివరికి రూ.7,500ని కూడా మూడు సార్లు చెల్లించడం దుర్మార్గం. దీనివల్ల ఏ రైతు అవసరం తీరదు. తెలుగుదేశం హయాంలోరూ.50వేలలోపు రైతు రుణాలను ఒకే దఫాలో సింగిల్ ఇనిస్టాల్మెంటులో రద్దు చేశాం. రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు గరిష్టంగా రూ.1,50,000 లబ్ధి పొందారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చివుంటే, 4, 5 విడతల రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు రూ.40వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.10వేలు చొప్పున ఒక్కో రైతుకు సగటున సుమారు రూ.50వేల వరకు లబ్ధి చేకూరేది.


అకాల వర్షాలతో పలు జిలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 10వేల హెక్టార్లలో వరి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి హామీ తుంగలో తొక్కారు. రూ.4వేల కోట్ల విపత్తు సహాయ నిధి గాలికి వదిలేశారు. ఒక్క ఏడాదిలోనే 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. చేతగానితనంతో వైసీపీ రైతులను కష్టాల సుడిగుండంలోకి నెట్టి ఇప్పుడు జులై 8న రైతు దినోత్సవం పేరుతో సంబరాలు జరపడం హేయం. రాబోయే రోజుల్లోనైనా రైతులకు మేళ్లు చేసే చర్యలు చేపట్టాలని, ఆగిపోయిన ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని, వివిధ పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని కోరుతున్నాం.


యనమల రామకృష్ణుడు

ప్రతిపక్షనాయకుడు, శాసనమండలి


Updated Date - 2020-07-08T06:23:50+05:30 IST