మా వాళ్లను అంటే.. ఆ మాత్రం స్పందన వస్తుంది!

ABN , First Publish Date - 2021-11-20T08:16:57+05:30 IST

తన చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి అసెంబ్లీలో స్వయంగా చంద్రబాబు ప్రస్తావించి పాలకపక్షాన్ని ప్రేరేపించారని.. అలాంటప్పుడు ఆ మాత్రం స్పందన వస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ప్రతిపక్ష నేత ప్రస్టేషన్‌లో ఉన్నారని..

మా వాళ్లను అంటే.. ఆ మాత్రం స్పందన వస్తుంది!

  • చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు
  • ఆయనపై రాష్ట్రమంతటా వ్యతిరేకత
  • కుప్పంలోనూ ప్రజలు ఓడించారు
  • అసెంబ్లీ బాయ్‌కాట్‌ దురదృష్టకరం
  • ఆయనది రాజకీయ అజెండా: సీఎం
  • ఎమ్మెల్సీ కాకుండా వివేకాను బాబే ఓడించారు
  • అసెంబ్లీలో సీఎం జగన్‌ వ్యాఖ్యలు


అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తన చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి అసెంబ్లీలో స్వయంగా చంద్రబాబు ప్రస్తావించి పాలకపక్షాన్ని ప్రేరేపించారని.. అలాంటప్పుడు ఆ మాత్రం స్పందన వస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ప్రతిపక్ష నేత ప్రస్టేషన్‌లో ఉన్నారని.. తనకూ, తన పార్టీ ఎమ్మెల్యేలకూ, రాష్ట్ర ప్రజలందరికీ ఇది తెలుసని చెప్పారు. శాసనసభను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం దురదృష్టకరమన్నారు. వ్యవసాయ శాఖపై శాసనసభలో శుక్రవారం జరిగిన స్వల్పవ్యవధి చర్చలో సీఎం మాట్లాడారు. తాను సభలోకి రావడానికి ముందు ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. తాను వచ్చే సమయానికి చంద్రబాబు కళ్ల నీళ్లు పెట్టుకుని దీనంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ కనిపించారని.. ఏం జరిగిందో తనకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారని తెలిపారు. తర్వాత తోటి శాసనసభ్యులు మాట్లాడిన మాటలతో పరిస్థితి అర్థమైందన్నారు.


రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైతాంగం.. ఆ ప్రాంతం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. శాసనసభలో వ్యవసాయానుబంధ రంగాలపై చర్చ జరుగుతుంటే రైతాంగానికి ఎలాంటి సహాయం అందించాలో సలహాలూ సూచనలూ చేయాల్సిన చంద్రబాబు రాజకీయ డ్రామాలకు దిగారని ఆరోపించారు. సమస్యలను పక్కన పెట్టి తనది రాజకీయ అజెండా అన్నట్లు వ్యవహరించారని.. ఆయన డ్రామాలన్నీ అందరి కళ్ల ముందు కనిపించాయని చెప్పారు. వర్షాలపై తాను కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడానని, తానొచ్చేసరికి చంద్రబాబు డ్రామా ఆడుతూ కనిపించారన్నారు. మండలిలో దళిత సోదరుడు మోషేన్‌రాజు చైర్మన్‌గా కూర్చోబోతున్నారని.. దీనిని చూసి తట్టుకోలేకపోతున్నారని ీఆరోపించారు. ఫ్రస్ర్టేషన్‌లో ఉండి తానేం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పాలకపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడారని చెప్పారు. తన చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి చర్చిద్దామని చంద్రబాబు చెప్పారన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌.. వంగవీటి రంగా హత్య వంటి అంశాలపైనా మాట్లాడదామని పాలకపక్షం డిమాండ్‌ చేసిందని.. ఇందులో తప్పేముందని జగన్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అయ్యాకే శాసనసభలో అడుగుపెడతానని చంద్రబాబు అన్నాడని.. తాను నిమిత్త్తమాత్రుడినని.. పైన దేవుడున్నాడని.. ఆయన చల్లని దీవెనలు.. ప్రజల ఆశీర్వాదం ఉంటే అంతా మంచే జరుగుతుందని అన్నారు. ఎవరెంత గోబెల్స్‌ ప్రచారం చేసినా.. దేవుడి చల్లని దయ, ప్రజల దీవెనలు ఉన్నంత కాలం మంచికే అంతిమ విజయమని చెప్పారు. 


మా చిన్నాన్న ఎవరినైనా, ఏదైనా చేసి ఉంటే వారే హత్య చేశారేమో!

‘మా చిన్నాన్న ఎవరినైనా ఏదైనా చేసి ఉంటే.. వారే ఈ హత్య చేసి ఉండాలి. కానీ ఈ అంశాన్ని రాజకీయం చేసి.. మా కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా చిన్నాన్న మా నాన్నకు తమ్ముడు.. అవినాశ్‌ మరో చిన్నాన్న కొడుకు. ఒక కన్ను మరో కన్నును పొడుస్తుందా? ఒక చేయి మరో చేయిని నరుక్కుంటుందా? మా చిన్నాన్న స్థానిక సంస్థల కోటా శాసనమండలి సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నాడు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మెజారిటీ వైసీపీ సభ్యులే విజయం సాధిస్తే.. కొనుగోలు చేసే ప్రలోభాలకు గురిచేసి, భయభ్రాంతులను చేసి, పోలీసులను ఉపయోగించుకుని చిన్నాన్నను ఓడించారు. ఇది అనైతికం’ అని జగన్‌ అన్నారు.


వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం

ఆర్‌బీకేల్లో విత్తు నుంచి విక్రయం దాకా ధాన్యం కొనుగోళ్లు కూడా అక్కడే: సీఎం


అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో తమ ప్రభుత్వం గతంలో ఎవరూ ఊహించని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తోందని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)ల్లో విత్తు నుంచి వ్యవసాయోత్పత్తుల విక్రయం దాకా రైతుకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు.  ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘విత్తు నుంచి కోత దాకా అన్నీ ఆర్బీకేలే చూస్తున్నాయి. వాటి పరిధిలోనే గోదాములు, కోల్డ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశాం. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నష్టాల సహాయక నిధిని ఏర్పాటు చేశాం. అమూల్‌ సహకార వ్యవస్థను తీసుకొచ్చాక పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి 15 దాకా అదనపు ఆదాయం వచ్చింది. చంద్రబాబు హెరిటేజ్‌ కూడా ఇప్పుడు పాడి పోసే మహిళలకు అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోంది. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రానున్నాయి. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలను అందిస్తున్న మా ప్రభుత్వానికి కలకాలం దేవుడి చల్లని దీవెనలుంటాయి’ అని ముఖ్యమంత్రి అన్నారు. కాగా.. చర్చ సందర్భంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. 


 14 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం

సచివాలయంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 14 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటిలో రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌, పట్టాదార్‌ పాసుబుక్స్‌ యాక్టు సవరణ, పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణ, రాష్ట్ర విద్యా హక్కు చట్టం సవరణ బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా భారీ వర్షాలు, ఆస్తి, పంటనష్టంపైనా మంత్రివర్గం చర్చించింది. 

Updated Date - 2021-11-20T08:16:57+05:30 IST