జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 28కి వాయిదా

ABN , First Publish Date - 2020-02-14T18:15:28+05:30 IST

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 28కి వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 28కి వాయిదా

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. వచ్చే శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో తదుపరి విచారణను 28కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఏ1 నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రాలేకపోతున్నారని న్యాయమూర్తికి ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. అలాగే ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. కాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, రాజగోపాల్‌, మరో ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరయ్యారు.


సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా...సీబీఐ కేసులకు సంబంధించి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఈడీ కేసులో తప్పని సరిగా హాజరుకావాల్సిందే అని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు కోర్టుకు న్యాయవాది తెలిపారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్ ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. అయితే ప్రతీ వారం ఏదో ఒక కారణం చూపుతూ జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈనెల 28న సీఎం జగన్ కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2020-02-14T18:15:28+05:30 IST