జంగారెడ్డిగూడెం ఘటనపై అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే....

ABN , First Publish Date - 2022-03-14T19:58:30+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో స్పందించారు.

జంగారెడ్డిగూడెం ఘటనపై అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారంటే....

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో స్పందించారు. సహజ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కల్తీ మద్యం మరణాలు గతంలో కూడా అనేక సార్లు జరిగాయన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా ఎత్తేశామని చెప్పారు. లాభాపేక్షతోనే గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలపై పూర్తి నియంత్రణ విధిస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల సూచనల మేరకు మద్యం ధరలు తగ్గించామని సీఎం జగన్ పేర్కొన్నారు. 


కాగా.. జంగారెడ్డిగూడెం ఘటన సభలో పెను దుమారాన్ని రేపింది. వరుస మరణాలపై  సభలో చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టి తమ్మినేనిపై కాగితాలు విసిరారు. ఈ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ టీడీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించారు. తెలుగు దేశం నేతల తీరుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను విరమించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయస్వామి బడ్జెట్‌ సెషన్ నుంచి పూర్తిగా సస్పెన్షన్‌కు గురయ్యారు.


Updated Date - 2022-03-14T19:58:30+05:30 IST