ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-04T15:38:26+05:30 IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు జరుగనున్నట్లు చెప్పారు. నిన్నటి వరకు సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అని, ఇంతటి ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలు ఉన్నవి ఏపీలోనే అని అన్నారు. ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు అని వెల్లడించారు. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగిందన్నారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచడం జరిగిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-04T15:38:26+05:30 IST