అమరావతిలో భూముల్ని పంచేస్తున్నారు.. ఏపీ సర్కారు వివాదాస్పద నిర్ణయం

ABN , First Publish Date - 2020-02-25T18:32:51+05:30 IST

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూముల వివరాలను విడుదల చేసింది.

అమరావతిలో భూముల్ని పంచేస్తున్నారు.. ఏపీ సర్కారు వివాదాస్పద నిర్ణయం

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూముల వివరాలను విడుదల చేసింది. ఈ మేరకు  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జీవో విడుదల చేసింది. దీనికోసం సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో భూములు సేకరించారు. మొత్తం 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులకు ఇవ్వనున్నారు. 


కాగా.. రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.. గతంలో సీఆర్డీయే చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లోంచి కేవలం 5శాతం మాత్రమే పేదలకు పంచే వీలు ఉంది.. ఈ లెక్కన మొత్తం 33వేల ఎకరాల భూమిలో.. 1650 ఎకరాలను మాత్రమే పేదలకు పంచొచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం ఏకంగా నాలుగు వేల ఎకరాల భూమిని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతానికి 1200 ఎకరాల భూమిని.. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు పంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఎక్కడో దూరంగా ఉంటున్న పేదలకు.. రాజధాని మండలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వజూపడమే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. మెజారిటీ పేదలు కూడా అంత దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఎలా..? అని ఆందోళన చెందుతున్నారు. స్వగ్రామాలను వదిలి అంత దూరం వచ్చేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజధానికి భూములిచ్చిన రైతులు మాత్రం ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండానే.. తమ భూములను పంచడం సమంజసమా..? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడకు వస్తున్న అధికారులను సైతం రాజధాని రైతులు నిలతీస్తున్నారు.  మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం.. రాజధాని పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను పంచే విషయంలో ఎలా ముందడుగు వేస్తుంది..? అన్నది వేచిచూడాలి.







Updated Date - 2020-02-25T18:32:51+05:30 IST