న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం

ABN , First Publish Date - 2020-10-18T08:47:23+05:30 IST

న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం

న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం

సీఎం జగన్‌ లేఖ దుస్సంప్రదాయం

సుప్రీం బార్‌ అసోసియేషన్‌ తీర్మానం

జగన్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలి

సుప్రీం సీజేకు క్యాట్‌ బార్‌ అసోసియేషన్‌ వినతి

లేఖ వెనుక హిడెన్‌ జెండా: ఏఐబీఏ 


న్యూఢిల్లీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం జగన్‌ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి లేఖరాయడాన్ని జాతీయ స్థాయిలో పలు బార్‌ అసోసియేషన్‌లు తీవ్రంగా దుయ్యబట్టాయి. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇలాంటి చర్యలు విఘాతమని, సీఎంపై చర్యలు తీసుకోవాలని తీర్మా నం చేశాయి. జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను బహిరంగంగా విడుదల చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతమ ని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గ కమి టీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారమే తీర్మానాన్ని ఆమోదించినట్లు అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండే శనివారం తెలిపారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి(సీఎం) ఇలాం టి చర్యలకు పాల్పడడం సంప్రదాయాలకు విరుద్ధమని అసోసియేషన్‌ పేర్కొన్నట్టు చెప్పారు. అంతేకాదు, దీనివల్ల జరిగే తీవ్ర పరిణామాలు రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతమని ఏకగ్రీవ తీర్మానంలో ఆమోదించినట్టు వెల్లడించారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తరఫున సుప్రీంలో వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే సుప్రీం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కావడం గమనార్హం. మరోవైపు, జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ లేఖ రాయడం, దానిని బహిరంగ పర్చడాన్ని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌) బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. సీఎం జగన్‌పై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించింది. ఈ మేరకు అసోసియేషన్‌ తీర్మానాన్ని ఆమోదించింది. న్యాయపరిపాలన, కోర్టుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చెడు సంప్రదాయానికి సీఎం పాల్పడ్డారని స్పష్టమవుతున్నట్టు అసోసియేషన్‌ పేర్కొంది. సుప్రీం కోర్టు, హైకోర్టుపై జగన్‌ చేసిన ఆరోపణలు కోర్టు ధిక్కర ణ కిందికే వస్తాయని తీర్మానంలో స్పష్టం చేసింది.  


ధిక్కార చర్యలు తీసుకోవాల్సిందే!

సీఎం జగన్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని అఖిల భారత బార్‌ అసోసియేషన్‌(ఏఐబీఏ) చైర్మన్‌ సీనియర్‌ అడ్వకేట్‌ ఆదిశ్‌ సీ అగర్వాల్‌ డిమాండ్‌ చేశారు. న్యాయవ్యవస్థపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి.. ఆయన వ్యక్తిగత స్వార్థం, హిడె న్‌ అజెండా స్పష్టమవుతున్నాయన్నారు. ఈ మేరకు చెన్నైలో మీడియాతో మాట్లాడిన అగర్వాల్‌.. ‘‘జగన్‌ అనేక అవినీతి, మనీ లాండరింగ్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. న్యాయమూర్తులను దుర్భాషలాడడం, వారిని బెదిరించడం ద్వారా తనకు అనుకూలంగా ఆదేశాలు ఇప్పించుకోవచ్చని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-18T08:47:23+05:30 IST