Abn logo
Oct 18 2020 @ 03:21AM

బయటకు రా.. కాళ్లు విరగ్గొడతా

Kaakateeya

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తావా?

ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శికి బెదిరింపులు

ఇంటి నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్త

పెద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతాయ్‌

బ్రిటన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ 

కార్యదర్శినంటూ ఓ వ్యక్తి ఫోన్‌

దుర్భాషలు, తీవ్ర హెచ్చరికలు

రాజంపేట ఎస్టీడీ కోడ్‌ నుంచి ఫోన్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులపై ఆరోపణలతో సీఎం జగన్‌ రాసిన లేఖను ఖండిస్తూ తీర్మానం చేసినందుకు కాళ్లు విరగ్గొడతామని   ఫోన్‌ చేసి బెదిరించినట్లు ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి అభిజిత్‌ పేర్కొన్నారు. దీనిపై ఆయన శనివారం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న తాను డిఫెన్స్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో పనిచేసుకుంటుండగా, ‘+8565’ నంబరుతో తనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఫోన్‌ చేసిన వ్యక్తి తాను యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ కార్యదర్శినని, లండన్‌ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడని అభిజిత్‌ చెప్పారు. (08565 కడప జిల్లా రాజంపేట ఎస్టీడీ కోడ్‌ కావడం గమనార్హం.) జగన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఎందుకు ఆమోదించారని ప్రశ్నించాడని తెలిపారు. అయితే, ఆ తీర్మానం బార్‌ అసోసియేషన్‌ చేసిందని, నాకేం సంబంధమని అడిగినట్టు అభిజిత్‌ వెల్లడించారు. దీంతో అతను హిందీలో అసభ్యకరమైన మాటలతో విరుచుకుపడి, ‘‘ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా వెళ్లు. లేకపోతే పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి’’ అని హెచ్చరించాడని అభిజిత్‌ తెలిపారు. అంతేకాకుండా ‘‘నీ కాళ్లు విరగ్గొడతాం. నీకు తెలియదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో’’ అని కూడా హెచ్చరించాడని చెప్పారు. ఆ ఫోన్‌ కాల్‌కు తాను స్పందించకుండా ఫోన్‌ను డిస్‌ కనెక్ట్‌ చేశానని తర్వాత మరోసారి అదే నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినా స్పందించలేదని చెప్పారు. ఆ తర్వాత అదే తరహా ఫోన్‌ కాల్‌ అదే నంబర్‌ నుంచి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహిత్‌ మాధుర్‌, కోశాధికారి మోహిత్‌ గుప్తాలకు కూడా వచ్చినట్లు తెలిసిందని అభిజిత్‌ వెల్లడించారు.


భయ భ్రాంతుల్లో మా కుటుంబం

అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ కాల్‌ తనను, తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసిందని అభిజిత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులు ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శిగా తన విధులను నిజాయితీతో, నిర్భయంగా నెరవేర్చకుండా చేసేందుకేనని స్పష్టమవుతోందని ఫిర్యాదులో పోలీస్‌ కమిషనర్‌కు వివరించారు. ఈ ఫోన్‌ కాల్‌ తన వ్యక్తిగత హక్కులకు, రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. బెదిరింపు ఫోన్‌ కాల్‌ ద్వారా సదరు వ్యక్తి తీవ్ర నేరానికి పాల్పడ్డారని, అందుకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఇతర చట్టాల కింద శిక్షలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తన లేఖను తీవ్రంగా పరిగణించి వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement