సీఎం జగన్‌రెడ్డిది నియంత పోకడ

ABN , First Publish Date - 2021-05-17T15:45:25+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రంలో..

సీఎం జగన్‌రెడ్డిది నియంత పోకడ

516వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, తాడికొండ, మే 16: ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్నది.. ప్రజాస్వామ్యపాలనలాలేదని.. నియంత పోకడలతో సీఎం జగన్‌రెడ్డి పాలిస్తున్నారని అమరావతి రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 516వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మనోవేదనతో రైతులు మరణిస్తుంటే ప్రభుత్వ పెద్దలు ఆనందపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే అన్నదాతను ఇబ్బందులు పెడితే తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. మూడు పంటలు పండే భూమిని అమరావతి కోసం ఇస్తే.. పాలకులు తమ స్వార్థం కోసం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. ఇంటింటి అమరావతి కార్యక్రమం కొనసాగింది. రైతు, రైతు కూలీల ఇళ్ల నుంచి జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు హోరెత్తాయి. రాజధాని రైతులకు అండగా ఉండకూడదనే ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేశారన్నారు. ఆయనపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తి వేయాలన్నారు. చీకటి పోయి అమరావతికి వెలుగు రావాలంటూ దీపాలు వెలిగించి నిరసనలు కొనసాగించారు. రాజధాని 29 గ్రామాలతో పాటు తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు ఆదివారం నిరసనలు తెలిపారు.  

Updated Date - 2021-05-17T15:45:25+05:30 IST