సీఎం హామీ.. అమలు కాదేమి?

ABN , First Publish Date - 2022-06-14T08:19:40+05:30 IST

కాంట్రాక్టర్ల చేతి కింద కూలీలుగా పని చేయడం కాకుండా రజకులు తమ కులవృత్తిని తామే చేసుకునిఆదాయం పొందేలా చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా అమల్లోకి కావడం లేదు.

సీఎం హామీ.. అమలు కాదేమి?

8 ప్రభుత్వ విభాగాల్లో దోభీ పనులు రజకులకే అప్పగిస్తామన్న కేసీఆర్‌

ఏళ్లు గడుస్తున్నా వెలువడని ఉత్తర్వులు


హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ల చేతి కింద కూలీలుగా పని చేయడం కాకుండా రజకులు తమ కులవృత్తిని తామే చేసుకునిఆదాయం పొందేలా చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా అమల్లోకి కావడం లేదు. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు శుభ్రపరిచే పనులు ప్రస్తుతం కాంట్రాక్టర్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద రజకులు కూలీలుగా పని చేస్తున్నారు. అలా కాకుండా రజకులకే నేరుగా ప్రభుత్వ సంస్థల్లో బట్టలు శుభ్రపరిచే పనులు అప్పగించడం వల్ల కూలీలుగా కాకుండా వారు సొంతంగా కులవృత్తి చేసుకుని జీవిస్తారని రజక సంఘాలు పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 2018 ఆగస్టు 11న సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో రజక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ప్రభుత్వ సంస్థల్లో బట్టలు శుభ్రపరిచే పని నేరుగా రజకులకు ఇవ్వాలని వారు సీఎంను కోరారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌ వెంటనే సీఎ్‌సకు ఫోన్‌ చేసి కాంట్రాక్టర్లకు దోభీ పనులు ఇవ్వడం సరైంది కాదని, రజకులకే ఆ పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకులాలు, అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్పోర్ట్స్‌ హాస్టళ్లు, ఆలయాలు, పర్యాటక శాఖ పరిధిలో నిర్వహిస్తున్న హరిత, కాకతీయ గెస్ట్‌హౌ్‌సలు, రోడ్లు, భవనాల గెస్ట్‌ హౌస్‌లు, పోలీస్‌ శాఖ, ప్రభుత్వ ఆస్పత్రులు, ఆర్టీసీ, మంత్రుల నివాస సముదాయాల్లో బట్టలు ఉతికి పరిశుభ్రపరిచే పనులు రజకులకే ఇస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఏళ్లు గడిచినా హామీ అమలు కాలేదు. దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో రజకులు సీఎంను మరోసారి కలిసి వినతి పత్రం ఇచ్చారు. రజకులకు దోభీ కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదని, కాంట్రాక్టర్ల స్థానంలో రజకులు తమ కులవృత్తి చేసుకుని జీవిస్తారని రజక సంఘాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఆధునిక దోభీ ఘాట్లు ఏర్పాటు చేసింది. వీటిని ఏర్పాటు చేసినా సరైన పనిలేకపోవడంతో కాంట్రాక్టర్ల చేతి కింద కూలీలుగా పని చేయాల్సి వస్తోందని కులవృత్తిని నమ్ముకున్న రజక కుటుంబాలు నిట్టూరుస్తున్నాయి. 

Updated Date - 2022-06-14T08:19:40+05:30 IST