సీఎం అభ్యర్థి ఎవరంటే...?: సిద్ధూ

ABN , First Publish Date - 2022-02-06T01:21:40+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ప్రకటించనుందనే కీలక ప్రశ్నకు ..

సీఎం అభ్యర్థి ఎవరంటే...?: సిద్ధూ

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ప్రకటించనుందనే కీలక ప్రశ్నకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారంనాడు ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చారు. ''60 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడం, కాకపోవడం అనే దానిపైనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయమవుతుంది'' అని ఆయన తెలిపారు. పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 117 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 59 మంది కంటే ఒకటి ఎక్కువగా (60) సంఖ్యా బలం అవసరం అవుతుంది.


పార్టీ సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ఆదివారంనాడు లూథియానాలో ప్రకటించేందుకు సిద్ధపడుతుండగా, ఈ రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీపీసీసీ చీఫ్ సిద్ధూ ఉన్నారు. దీంతో పార్టీలో సైతం ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించే అవకాశం ఉందని సిద్ధూను మీడియా సూటిగా ప్రశ్నించగా, పంజాబ్ అభివృద్ధికి దిశానిర్దేశం చేయగలిగిన విజన్ (రోడ్ మ్యాప్) ఉండి, ప్రజావిశ్వాసం పొందిన ఉన్న వ్యక్తి సీఎం అభ్యర్థి కాగలుగుతారని, అలాంటి వాడే 60 మంది అభ్యర్థులను సమర్ధవంతంగా గెలిపించగలుగుతాడని అన్నారు.


గత కొద్ది రోజులుగా అటు చరణ్‌జి్త సింగ్, ఇటు సిద్ధూ సైతం పరోక్షంగా తమను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయనే సంకేతాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో, పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని, ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన వారికి తాము సహకరిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో అధిష్ఠానం ఎవరి పేరును ప్రకటిస్తుంది? ప్రకటించిన తర్వాత ఆశావహుల్లో అసంతృప్తులు పెల్లుబుకే అవకాశం ఏ మేరకు ఉండవచ్చనేది ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Updated Date - 2022-02-06T01:21:40+05:30 IST