సీఎం, డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

ABN , First Publish Date - 2021-10-22T06:25:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ గూండాల దాడులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు వారి బాధ్యతారాహిత్యాన్ని చాటుతున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

సీఎం, డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం


టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

అనంతపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ గూండాల దాడులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు వారి బాధ్యతారాహిత్యాన్ని చాటుతున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే దాడులు జరిగాయని చెప్పడం చూస్తుంటే... రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న సీఎం, డీజీపీ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో అర్థమవుతోందన్నారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ అరాచక శక్తులు చేసిన దాడులపై సీఎం, డీజీపీ స్పందించిన తీరు హాస్యాస్పదమన్నారు. అధికార పార్టీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ యాదవ్‌ మాట్లాడిన తీరు నేపథ్యంలో ఎన్నిసార్లు భౌతికదాడులు జరిగి ఉండేవని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వాడే భాష సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఆ బూతులు వింటూ జగన పొందే పైశాచిక ఆనందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. బూతు బ్యాచ కొత్తగా సభ్యత గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఈ వరుస పరిణామాలు గమనిస్తే... జగన్మోహనరెడ్డి నుంచి తాము అంతకన్నా గొప్పగా ఆశించేది లేదన్నది తేటతెల్లమైందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన డీజీపీ.. వైసీపీ మూకల దాడులను వెనకేసుకురావడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా మారిందన్నారు. విమర్శిస్తే భౌతికదాడులకు పాల్పడవచ్చని కొత్త బాష్యం చెప్పడం డీజీపీకే చెల్లిందన్నారు. వీటన్నింటిపైనా తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కాలవ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-10-22T06:25:23+05:30 IST