CM Jagan వస్తున్నారని.. పోలీసుల అత్యుత్సాహం.. రోజంతా చుక్కలే..!

ABN , First Publish Date - 2021-11-21T05:49:43+05:30 IST

CM Jagan వస్తున్నారని.. పోలీసుల అత్యుత్సాహం.. రోజంతా చుక్కలే..!

CM Jagan వస్తున్నారని.. పోలీసుల అత్యుత్సాహం.. రోజంతా చుక్కలే..!
మధ్యాహ్నం.. కేదారేశ్వరపేటలో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌

  • కాన్వాయ్‌ వస్తుందని పోలీసుల అత్యుత్సాహం
  • ఉదయం ఏలూరురోడ్డు, కేదారేశ్వరపేటలో షాపులు మూసివేత
  • రాత్రి బందరు రోడ్డులో వాహనాల నిలిపివేత
  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌
  • శనివారమంతా నగరవాసులకు చుక్కలు


సీన్‌ 1.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు.. సీఎం జగన్‌ కాన్వాయ్‌ ఏలూరు రోడ్డు మీదుగా అజిత్‌సింగ్‌నగర్‌లో ఎమ్మెల్సీ కరీమున్నీసా భౌతికకాయాన్ని చూడటానికి వెళ్తుందనే సమాచారంతో పోలీసులు మధ్యాహ్నం 12 గంటల నుంచే హడావుడి చేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే వరకూ ఏలూరురోడ్డుతో పాటు కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌లోని షాపులను మూసివేయించారు. తోపుడు బండ్లను కూడా కట్టేశారు. ఫలితంగా గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించింది. 


సీన్‌ 2.. శనివారం రాత్రి 7.30 గంటలకు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కుమారుడి వివాహం వీఆర్‌ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరగ్గా, తాడేపల్లి నుంచి సీఎం కాన్వాయ్‌ వస్తుందనే సమాచారంతో పోలీసులు బందరురోడ్డును స్తంభింపజేశారు. గంట ముందే ఎక్కడి వాహనాలను అక్కడ నిలుపుదల చేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గమే కాకుండా మరోపక్క కూడా ఆపేశారు. దీంతో రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 


విజయవాడ - ఆంధ్రజ్యోతి : ఆగిన కారు ముందుకు కదల్లేదు. అంబులెన్స్‌ను వన్‌వేలో పంపించారు. ద్విచక్ర వా హనదారులు వాహనాల మధ్య ఇరుక్కుపోయారు. సీఎం జగన్‌ శనివారం రెండుసార్లు నగరంలో పర్యటించడంతో ప్రజలు నరకం చూశారు. ఎమ్మెల్సీ కరీమున్నీసా భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అజిత్‌సింగ్‌ నగర్‌లోని ఆ మె ఇంటికి వచ్చారు. దీంతో ఏలూరు రోడ్డు మొత్తాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. సీఎం కాన్వాయ్‌ వచ్చి, వెళ్లేవరకు షాపులన్నీ మూయించారు. రెండువైపులా ట్రాఫిక్‌ నిలిపేశారు. చివరికి బస్‌స్టాపుల్లో ప్రయాణికులను పంపేశారు.


గతంలో ఎక్కడా కనిపించని సంప్రదాయం ఇప్పుడు కనిపించిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో షాపులు మూయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ట్రాఫిక్‌ సమస్య కొనసాగుతూనే ఉం ది. ఏలూరు రోడ్డులో పరిస్థితి ఇలా ఉంటే.. బందరు రోడ్డు లో వాహనదారులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కుమారుడి వివాహం వీఆర్‌ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరిగింది. సీఎం కాన్వాయ్‌ తాడేపల్లి నుంచి బయలుదేరక ముందే పోలీసులు బంద రు రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించేశారు. సీఎం జాతీయ రహదారి మీదుగా బెంజ్‌ సర్కిల్‌ చేరుకుని బందరు రోడ్డులోకి ప్రవేశించారు. సీఎం వచ్చేమార్గంలోనే కాకుండా పక్క మా ర్గంలోనూ ట్రాఫిక్‌ మళ్లించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.








బందరు రోడ్డు నుంచి బెంజ్‌సర్కిల్‌ వచ్చే వాహనాలను ఆటోనగర్‌ 100 అడుగుల రోడ్డు నుంచి రామవరప్పాడు రింగ్‌ మీదకు మళ్లించారు. వాళ్లంతా రామవరప్పాడు రింగ్‌కు చేరుకుని అక్కడి నుంచి వివిధ మార్గా ల్లో వెళ్లాల్సి వచ్చింది. అటు ఏలూరు రోడ్టు, ఇటు ఎంజీ రోడ్డులోనూ ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఇంత దారుణమైన పరిస్థితులను ఎన్నడూ చూడలేదని వాపోయారు.

Updated Date - 2021-11-21T05:49:43+05:30 IST