చర్చించుకుందాం... సిద్ధూకు చన్నీ ఆహ్వానం

ABN , First Publish Date - 2021-09-29T21:41:41+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో తలెత్తిన సంక్షోభాన్ని..

చర్చించుకుందాం... సిద్ధూకు చన్నీ ఆహ్వానం

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కారించేందుకు స్థానిక నాయకత్వం చకచకా పావులు కదుపుతోంది. కేంద్ర నాయకత్వం 'వేచిచూసే ధోరణి'ని అనుసరిస్తూ, స్థానిక నాయకత్వాన్నే సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించింది. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చర్చలకు సిద్ధూను ఆహ్వానించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సిద్ధూతో తాను బుధవారంనాడు ఫోనులో మాట్లాడినట్టు మీడియాకు చెప్పారు. ''పార్టీకి అధ్యక్షుడే పెద్ద. ఆయన ఏ సమస్య ఉన్నా పార్టీతో చర్చించాలి. పార్టీనే సుప్రీం. మీరు (సిద్ధూ) వచ్చి...సమస్యను పరిష్కరించుకోండి'' అని సిద్ధూకు తాను చెప్పినట్టు తెలిపారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ గోయెల్ సైతం సిద్ధూ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


రాత్రి వరకూ గడువు...

తన రాజీనామాను లేఖను సిద్ధూ వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం రాత్రి వరకూ గడువు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్ధూను ఒప్పించేందుకు అధినాయత్వం ఆసక్తిగా లేదని, రాత్రిలోగా రాజీనామా వెనక్కి తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోకుంటే ఆయన రాజీనామాను ఆమోదించి తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోందని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా 'ప్లాన్ బీ' యోచన కూడా చేస్తోంది. తదుపరి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కోసం ప్రయత్నాలు సాగించాలని పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి హరీష్ రావత్‌కు ఆదేశాలిచ్చింది.

Updated Date - 2021-09-29T21:41:41+05:30 IST