బీజేపీ-ఎస్ఏడీ భాగస్వామ్యంపై సీఎం చన్నీ మండిపాటు

ABN , First Publish Date - 2022-02-20T21:23:43+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతతో

బీజేపీ-ఎస్ఏడీ భాగస్వామ్యంపై సీఎం చన్నీ మండిపాటు

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతతో గెలుస్తుందని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. బీజేపీ-ఎస్ఏడీ భాగస్వామ్యం స్పష్టంగా బయటపడిందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు డేరా సచ్చా సౌదా నుంచి మద్దతు పొందుతున్నాయన్నారు. ఈ పార్టీలు జట్టు కట్టినప్పటికీ, పంజాబ్ ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారని, ఓట్లతో గుణపాఠం చెబుతారని అన్నారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కూడా ధురిలో డేరా సచ్చా సౌదా మద్దతు కోరారని ఆరోపించారు. ఈ పార్టీల నైరాశ్యాన్ని చూసినపుడు పంజాబ్‌లో కాంగ్రెస్ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందన్నారు. ఆదివారం ట్విటర్ వేదికగా చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఇదిలావుండగా, పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పాటియాలా నియోజకవర్గం నుంచి తాను గెలిచి తీరుతానని మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక లోకంలో విహరిస్తోందని, ఆ పార్టీ పంజాబ్‌లో తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేత బిక్రమ్ సింగ్ మజిథియా ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 


Updated Date - 2022-02-20T21:23:43+05:30 IST