ముఖ్యమంత్రులు కంటతడి పెట్టే జాబితాలో ఆయన కూడా ఉన్నారా...

ABN , First Publish Date - 2021-12-21T17:21:48+05:30 IST

కర్ణాటకలో ముఖ్యమంత్రులు కంటతడి పెట్టే జాబితాలో బసవరాజ్‌ బొమ్మై కూడా చేరారు. ఆదివారం సొంత

ముఖ్యమంత్రులు కంటతడి పెట్టే జాబితాలో ఆయన కూడా ఉన్నారా...

                        -  CM మార్పు ప్రశ్నే లేదు                    

                         - మంత్రుల స్పష్టీకరణ


బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రులు కంటతడి పెట్టే జాబితాలో బసవరాజ్‌ బొమ్మై కూడా చేరారు. ఆదివారం సొంత నియోజకవర్గం హావేరి జిల్లా శిగ్గావిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పదవి ఎంతకాలమో... కానీ మీ అభిమానం చిరకాలం అంటూ చేసిన వ్యాఖ్య సోమవారం రాజకీయ వర్గాల్లో పెనుచర్చకు దారితీసింది. బెళగావిలో శాసనసభ సమావేశాల వేళ ఇదే అంశం ఇటు అధికార, అటు ప్రతిపక్షాల మధ్య గుసగుసలాడింది. ముఖ్యమంత్రి మార్పు ప్రసక్తే లేదని సొంత నియోజకవర్గంలో సీఎం బొమ్మై భావోద్వేగం చెందారని అంతకుమించి మరో అంశం లేదని మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ స్పష్టం చేశారు. మంత్రి కోట శ్రీనివాసపూజారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రగతిపరంగా ప్ర భుత్వం సాగుతోందని మార్పు ప్రసక్తే లేదన్నారు. రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌ మాట్లాడుతూ సొంతప్రాంతం, సొంత మనుషులమధ్య మాట్లాడే సందర్భాన్ని రాజకీయ దుమారం చేయరాదన్నారు. విజయపుర బీజేపీ ఎంపీ రమేశ్‌ జిగజిణగి మీడియాతో మాట్లాడుతూ సీఎం మార్పు అంశంపై అధిష్ఠానం కట్టడి చేయాలని, కార్యకర్తలలో తప్పుడు సందేశం పోరాదన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వందరోజులు మాత్రమే అయిందని, వీటి వెనుక ఎవరున్నారనే కోణంలో అధిష్ఠానం చొరవ చూపాలన్నారు. పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ మాట్లాడుతూ మార్పు సహజమని అవి నిరంతర ప్రక్రియ అని, కానీ సీఎం భావోద్వేగానికి ఒక అర్థం ఉందన్నారు. తన జోస్యం ఎప్పటికీ అసత్యం కాదన్నారు. కొత్త వ్యవస్థ రాష్ట్రంలో రానుందన్నారు. పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా చేయడానికి సిద్ధమన్నారు. కాగా మాజీ సీఎం కుమారస్వామి బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మానవత్వం ఉన్నవారికి మాత్రమే బొమ్మై భావనలు అర్థమవుతాయన్నారు. శిగ్గావిలో వరుసగా నాలుగుసార్లు ప్రజలు ఆశీర్వదించారు. వారితో భావనలు పంచుకోవడం తప్పు కాదన్నారు. ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లేందుకు అక్కడి ప్రజలే కారణమన్నారు. మాతృహృదయం ఉండేవారికి మాత్రమే సమగ్రంగా అర్థమవుతుందన్నారు. 

Updated Date - 2021-12-21T17:21:48+05:30 IST