Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నగర శివార్లకు సీఎం వరాలు

twitter-iconwatsapp-iconfb-icon
నగర శివార్లకు సీఎం వరాలుమాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌, సభకు హాజరైన జనం

  • మేడ్చల్‌ జిల్లాలోని నియోజకవర్గాలకు రూ. 70కోట్లు కేటాయింపు
  • బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచన
  • పేదల కోసం వినియోగించాలని ఆదేశం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): నగర శివార్లలోని నియోజకవర్గాలకు సీఎం వరాలు జల్లు కురిపించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నియోజకవర్గాల్లోని బస్తీలు, కాలనీల్లో మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు మేడ్చల్‌ జిల్లాలో కలిసి ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల నిధులు అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 5 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తుందని దీనికి అదనంగా మరో రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాలకు ఈ నిధులు అందచేస్తున్నట్లు తెలిపారు. వీటిని తక్షణమే విడుదల చేస్తామని గురువారం జీవో జారీ చేస్తామన్నారు. రూ.70 కోట్లను పేద ప్రజల ఉండే ప్రాంతాల్లో ఖర్చుపెట్టాలని ఎమ్మెల్యేలకు ఆదేశించారు. రంగారెడ్డిజిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ మేడ్చల్‌ జిల్లాలో స్వల్పంగా కలిసే శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌కు కూడా సీఎం నిధులు విడుదల చేయడం గమనార్హం. త్వరలో రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఈ సమయంలో శివార్లలో మిగిలిన మహేశ్వరం, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సీఎం మేడ్చల్‌ జిల్లా వాసులను కొనియాడారు. మేడ్చల్‌ జిల్లా వాసులు చైతన్యం ఉన్న వారని ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. మేడ్చల్‌ కొత్త జిల్లా ఏర్పడుతుందని ఎవరూ కలగూడ కనలేదన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత చేరువైతే అంత త్వరగా పనులు జరుగుతాయని, పరిపాలన సౌలభ్యం కోసం మేడ్చల్‌ జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మేడ్చల్‌ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు తక్కువని, దీంతో ఇక్కడకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయన్నారు. ఈప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని, రియల్‌ ఎస్టేట్‌ పెరుగుతుందని అన్నారు. వీటివల్ల స్థానికంగా కాలనీలు, బస్తీల్లో చాలా అభివృద్ధి పనులు చేయాల్సి వస్తుందన్నారు. ఇందుకే ఈ ప్రాంతానికి అదనంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. 


పోలీసుల అత్యుత్సాహం

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద సైబరాబాద్‌ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం రాకకు అరగంట ముందే ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ నిలిపివేశారు. సభకు హాజరయ్యేందుకు వస్తున్న జనాన్ని సైతం అరగంటపాటు రోడ్డుపైనే నిలబెట్టేశారు. అన్ని మార్గాలను మూసివేస్తూ హైదరాబాద్‌ నుంచి వచ్చిన మీడియాను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసులుగా చెప్పుకునే పోలీసులు మీడియాపై దురుసుగా వ్యవహరించారు. అయితే అదే సమయంలో చోటామోటా నేతలను మాత్రం లోపలికి పంపించడం గమనార్హం. దీనిపై ప్రధాన గేటు వద్ద పోలీసులకు అక్కడ ఉన్నవారికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. పోలీసుల అత్యుత్సాహంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సీఎంకు ఘన స్వాగతం 

మేడ్చల్‌ , ఆగస్టు 17 :  హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 3.36 గంటలకు అంతాయిపల్లిలోని మేడ్చల్‌ జిల్లా నూతన కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు  కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితోపాటు కలెక్టర్‌ హరీష్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. తర్వాత సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి బెలూన్‌లను గాలిలోకి వదిలారు. 3.49 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కలెక్టరేట్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ హరీ్‌షను ఆయన కుర్చిలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్ధనల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ హరీష్‌ దంపతులు, ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు జ్ఞాపికలను అందజేశారు.


సీఎంకు జ్ఞాపికల అందజేత..

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు సీఎం కేసీఆర్‌కు ఙ్ఞాపికలు అందజేశారు.   


భారీ బైక్‌ ర్యాలీ

సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. అల్వాల్‌ తోట ముత్యాలమ్మ ఆలయం నుంచి హకీంపేట వరకు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. అల్వాల్‌ నుంచి తూంకుంట దొంగలమైసమ్మ చౌరస్తా వరకు అడుగడుగునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజీవ్‌రహదారికి పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రహదారి పూర్తిగా గులాబీమయమైంది. మేడ్చల్‌, కుత్భుల్లాపూర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి సభకు జన సమీకరణ చేశారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సభ విజయవంతానికి కృషి చేశారు. 


ముందస్తు అరెస్టులు

సీఎం కార్యక్రమం సందర్భంగా పోలీసులు బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ తదితర పార్టీల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని సనత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మంగళవారం రాత్రే పోలీసులు ఆయా పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకుని సీఎం సభ ముగిసిన తర్వాత వదిలిపెట్టారు. సీపీఐ నేత సాయులుగౌడ్‌, బీజేపీ నేత రవిగౌడ్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభలో కూడా అనుమానం వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సీఎం కార్యక్రమం సందర్భంగా సభా వేదిక వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనుకున్న సమయానికంటే సీఎం దాదాపు గంట ఆలస్యంగా చేరుకోవడంతో ప్రజలకు బోరు కొట్టకుండా కళాకారులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. 


కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

సీఎం కార్యక్రమం పూర్తయిన తర్వాత నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలో కొలువుతీరిన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీ్‌షను ఆయా శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. జిల్లా అదనపులు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి,  జాన్‌శ్యాంసన్‌, డీఆర్‌డీవో లింగ్యానాయక్‌, డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి, బాలానగర్‌ డీసీపీ సందీప్‌,  ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రె డ్డి, ప్రధానకార్యదర్శి గౌతంకుమార్‌, టీఎన్‌జీఓ్‌స  జిల్లా అధ్యక్షుడు రవిప్రకాశ్‌, కార్యదర్శి ప్రవీణ్‌రావు తదితరులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతన  కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ఆయా శాఖల ఉద్యోగులు ఉత్సాహంగా ఫొటోలు దిగడం కనిపించింది. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్‌రావు, మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్‌, భేతి సుభా్‌షరెడ్డి, అర్కిపుడి గాంధీ, సుధీర్‌రెడ్డి,  ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడి,్డ తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీపీ ఎల్లుబాయి, జెడ్పీటీసీ అనిత, పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.