తన పుట్టినరోజు సందర్భంగా Cm ఏమన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-01-29T17:01:37+05:30 IST

మానవత్వం, సమానత్వం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. 62వ జన్మదినం రోజునే ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పుస్తకాన్ని

తన పుట్టినరోజు సందర్భంగా Cm ఏమన్నారో తెలిస్తే...

బెంగళూరు: మానవత్వం, సమానత్వం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. 62వ జన్మదినం రోజునే ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం విధానసౌధ బ్యాంకెట్‌హాల్‌లో ‘ఉజ్వల భవిష్యత్తుకోసం హామీలవైపు’ (భవ్య భవిష్యక్కాగి భరవసెయ హెజ్జెగళు) పుస్తకాన్ని మంత్రుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆరు నెలల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లామన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తామన్నారు. మానవతా విలువలకు ఎక్కడా భంగం కలిగించబోనన్నారు. ప్రజా సంక్షేమమే ముఖ్యమని, ప్రజలకోసం ప్రజలచేత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆరు నెలల్లో ప్రజాసంక్షేమం వీడి వ్యక్తిగతమైన నిర్ణయాలకు అవకాశం ఇవ్వలేదన్నారు. తమది స్పందించే గుణం కలిగిన ప్రభుత్వమని, ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా రైతులు, పేదలు, శ్రామిక జీవులకు కష్టం కలిగించలేదన్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దివ్యాంగులు, వితంతువులకు పింఛను పెంచామన్నారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితులను అన్ని వర్గాలకు అండగా నిలిచామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బంది కలిగించాయన్నారు. నేల, నీరు, సరిహద్దు విషయంలో కలసికట్టుగా పోరాటం చేశామన్నారు. పరిశ్రమలు సాధించేందుకు కట్టుబడ్డామన్నారు. రైతుల ఆదాయం పెంచాలనే కేంద్రప్రభుత్వానికి అనుగుణంగా సంక్షేమాలు అమలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బృందంలో తానో సభ్యుడినని, ఇక్కడ ఎవరూ ఎక్కువ తక్కువ లేదని ఎంతోమంది ముఖ్యమంత్రులతో కలసి పనిచేశానన్నారు. మంచి చేయాలని తన ఆశయమని, ఇదే మంత్రులకు సూచిస్తానన్నారు. రానున్న ఏడాది ప్రజాకర్షక పనులు, సమగ్ర అభివృద్ధికి కట్టుబడ్డామన్నారు. రాష్ట్రంలోని వనరులను పెంపొందించుకుంటూనే సమగ్ర కర్ణాటక అభివృద్ధిని సాధిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఈశ్వరప్ప, సోమణ్ణ, బీసీ పాటిల్‌, సుధాకర్‌, గోపాలయ్య, శంకర్‌ పాటిల్‌ మునేనకొప్ప, గోవింద కారజోళ, మురుగేశ్‌ నిరాణి, జ్ఞానేంద్ర, బీసీ నాగేశ్‌, అశోక్‌, బైరతి బసవరాజ్‌, ఎస్‌టీ సోమశేఖర్‌, ప్రభుత్వ కార్యదర్శి రవికుమార్‌ సహా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T17:01:37+05:30 IST