Bommai పాలనకు ఏడాది.. సంబరాలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-07-21T18:36:56+05:30 IST

దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రతి సందర్భాన్ని భారీ సభలు, సంబరాలు, సమావేశాల పేరిట ప్రజల్లోకి

Bommai పాలనకు ఏడాది.. సంబరాలకు సన్నాహాలు

- దొడ్డబళ్లాపురలో బీజేపీ భారీ బహిరంగ సభ

- ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం

- అధిష్టానం పెద్దలతో చర్చలు

- జనసమీకరణకు కమిటీలు

- ప్రారంభమైన ఏర్పాట్లు


బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రతి సందర్భాన్ని భారీ సభలు, సంబరాలు, సమావేశాల పేరిట ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పాలన ప్రారంభమై ఏడాది అవుతున్న సందర్భంగా భారీగా సంబరాలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 28నాటికి బొమ్మై పాలనకు ఏడాది కానుంది. అదే రోజు దొడ్డబళ్లాపురలో ‘సాధన సంభ్రమ’ పేరిట భారీస్థాయిలో సభను నిర్వహించేందుకు కమలదళాలు సిద్ధమయ్యాయి. సంబరం ద్వారా రాష్ట్రంలో ఉత్తమమైన పాలన అందిస్తున్నామనే సందేశాన్ని తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో మరో పది నెలల్లో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మరోసారి అధికారంలోకి రావడంపై అధిష్టానం దృష్టి సారించింది. కర్ణాటకలో అధికారం దక్కించుకోవడం ద్వారా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పొందవచ్చుననే వ్యూహంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు. మైసూరు ప్రాంతంలో బీజేపీ బలం పెంచుకునే దిశగా ఇటీవల యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. రెండు రోజులపాటు మైసూరులో ప్రధాని గడపడం ద్వారా మైసూరు, మండ్య, హాసన్‌, చామరాజనగర జిల్లాల ప్రజలకు చేరవయ్యే ప్రయత్నం చేశారు. ఏడాది సంబరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిపై ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన విషయంపై పార్టీ పెద్దలతో చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయానికి సంబరాల ఏర్పాట్లు, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, అత్యవసరమైన పథకాలకు సంబంధించి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ బలప్రదర్శన సభగా దీనిని మార్చే ఆలోచనలో ఉన్నారు. దొడ్డబళ్లాపుర తాలూకాలో ఏర్పాటు చేసే సభకు లక్షమందికిపైగా జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. కోలారు, రామనగర, మండ్య, తుమకూరు జిల్లాలను కేంద్రీకరించుకుని సభ నిర్వహించదలిచినట్టు సమాచారం. సభ నిర్వహణపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. జిల్లాలవారిగా ముఖ్యనేతలు వెళ్లి జనసమీకరణ చేయాలని పార్టీ నిర్దేశం చేయనుంది. మాజీ సీఎం యడియూరప్పతోపాటు పలువురు ముఖ్యనేతలు నాలుగు జిల్లాల్లో పర్యటించి జనసమీకరణపై ముఖ్యనేతలకు సలహాలు ఇవ్వనున్నారు. దొడ్డబళ్లాపుర సభ బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌కు అప్పగించినా, పూర్తిస్థాయి పర్యవేక్షణకు మరో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ సభ ద్వారా బీజేపీ పట్ల ప్రజలు ఆసక్తితో ఉన్నారనే సంకేతం ఇవ్వాలని భావిస్తున్నారు. 150 శాసనసభ స్థానాలు కైవసం చేసుకునేందుకు అధిష్టానం పార్టీ నేతలకు మార్గదర్శనం చేస్తోంది. 

Updated Date - 2022-07-21T18:36:56+05:30 IST