Abn logo
Nov 26 2021 @ 11:33AM

ఆ ముగ్గురూ.. మహావీరులు

               - బుద్ద, బసవ, అంబేడ్కర్‌లకు సీఎం ప్రశంసలు


బెంగళూరు: బుద్ద, బసవ, అంబేడ్కర్‌లు మహావీరులని, కాలాతీతులని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం విశ్వ బౌద్ద ధర్మ సంఘం, నాగసేన బుద్ద విహారల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ సమ్మేళనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. భారత రాజ్యాంగం ఆవిష్కరింపబడి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి బొమ్మై ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బుద్దుడు బోధించిన శాంతిమంత్రం, బసవణ్ణ బోధించిన సమానత్వ సిద్దాంతం, ప్రజాస్వామ్యాన్ని బలోపే తం చేసే అంబేడ్కర్‌ రాజ్యాంగం తరతరాల పాటు ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుంచుకొనే ఘట్టాలన్నారు. మహనీయుల శాంతి బోధనలు కాలాతీతమైనవని పేర్కొన్న ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ఈ మహనీయుల ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. శాంతియుత విధానాలతోనే ప్రగతి సాధ్యమన్నారు. ప్రపంచం మొత్తానికి దారిచూపిన ఈ మహనీయుల పేరిట ఇలాంటి సదస్సులు నిర్వహిస్తుంటే యువతరంలో స్ఫూర్తి నింపుతాయన్నారు. రాజకీయ సిద్దాంతాలు వేర్వేరుగా ఉన్నా దేశ భక్తి విషయంలో సిద్దాంత బేధాలకు తావు ఉండరాదని సీఎం అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆధునిక బుద్ద భగవానుడి అవతారం అని దీనదళితులు ప్రగాడంగా విశ్వసిస్తున్నారన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి, నిరాధరణ వర్గాలకు గురైన వర్గాలను ప్రధాన జీవన స్రవంతివైపు రాజ్యాంగం అనే ఆయుధంతో ముందుకు నడిపించిన ఖ్యాతి అంబేడ్కర్‌కే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజ్యాంగమే నా మత గ్రంథం అంటూ పలు మార్లు స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరితరం కాదన్నారు. ప్రపంచ దేశాల్లో భారత ప్రజస్వామ్యం అత్యంత పటిష్టంగా ఉందంటే ఇందుకు అంబేడ్కర్‌ రూపొందించిన దూర, విశాల దృష్టితో కూడిన అద్భుతమైన రాజ్యాంగమే కారణమన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.వెంకటస్వామితో పాటు ప లువురు ప్రముఖులు ఈ సందర్భంగా హాజరయ్యారు. అంతకుముందు అంబేడ్కర్‌ ఆశయాల సాధనకు కృషి చేస్తామని రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు.