విధాన పరిషత్‌ ఎన్నికల్లోనూ నాలుగు స్థానాలూ గెలుస్తాం

ABN , First Publish Date - 2022-06-12T17:10:47+05:30 IST

విధానపరిషత్‌కు ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల నుంచి జరగుతున్న నాలుగు స్థానాల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని

విధాన పరిషత్‌ ఎన్నికల్లోనూ నాలుగు స్థానాలూ గెలుస్తాం

                     - ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై


బెంగళూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): విధానపరిషత్‌కు ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల నుంచి జరగుతున్న నాలుగు స్థానాల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై జోస్యం చెప్పారు. బీజేపీది ఏ టీమ్‌ అని ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, జేడీఎస్‌ పరోక్షంగా ఒప్పుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. బెళగావి జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శుక్రవారం కొద్దిసేపు మీ డియాతో మాట్లాడారు. బీజేపీకి జేడీఎస్‌ బీటీమ్‌ అని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అంటున్నారు. బీజేపీకి కాంగ్రెస్‌ బీ టీమ్‌ అని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన మాది ఏ టీమ్‌ అని ఇద్దరూ అంగీకరించినట్లే కదా అని ఆయన చమత్కరించారు. కాగా ఈ ఇద్దరు నేతలు తనను విమర్శించినా సరే వారి మధ్య తాను తలదూర్చబోనని బొమ్మై అన్నారు. ఏ రాజకీయ పార్టీనీ అంతం చేయడం ఎవరి వల్లా కాదని, ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలదే తుది నిర్ణయమని సీఎం పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి మూడు స్థానాల్లో జయభేరి మోగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రధాని మోదీ స్వయంగా తనకు ఫోన్‌చేసి అభినందించారని ఆయన పేర్కొన్నారు. పరిషత్‌ ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ చాలా బలంగా ఉందని, నేతల మధ్య చక్కటి ఐక్యత సమన్వయం కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. బెళగావిలో సీనియర్‌ నేత ప్రభాకర్‌ కోరె బీజేపీలోనే ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. బెళగావి పర్యటన సమయంలో ప్రభాకర్‌ కోరె గైర్హాజరు కావడాన్ని ప్రస్తావించగా సీఎం పై విధంగా బదులిచ్చారు. కాగా రాష్ట్రంలో శాంతిని కాపాడాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ నేతలపై అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించబోదన్నారు. నిరసన ర్యాలీలకు అనుమతుల విషయంలో జిల్లాల ఎస్పీలే అంతిమ నిర్ణయం తీసుకుంటారన్నారు. 

Updated Date - 2022-06-12T17:10:47+05:30 IST