రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు

ABN , First Publish Date - 2022-02-11T17:45:11+05:30 IST

రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం జాతీయస్థాయిలో చర్చకు కారణమై పార్టీ ప్రతిష్ట కొంతమేరకు దెబ్బతినడంతో బీజేపీ అధిష్ఠానం పెద్దలు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చే

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు

- హిజాబ్‌పై పార్టీ నేతలకు బీజేపీ అధిష్ఠానం ఆదేశం 

- ఘర్షణలు జరిగిన జిల్లాల్లో తిరిగి సహజస్థితి 


బెంగళూరు: రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం జాతీయస్థాయిలో చర్చకు కారణమై పార్టీ ప్రతిష్ట కొంతమేరకు దెబ్బతినడంతో బీజేపీ అధిష్ఠానం పెద్దలు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని గురువారం రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే గురువారం బీజేపీ నేతలెవ్వరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. శివమొగ్గ విద్యాసంస్థలో కాషాయ పతాకాన్ని ఎగురవేయడాన్ని గట్టిగా సమర్థించుకున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని సంవత్సరాలకు దేశమంతా కాషాయ రెపరెపలు ఉంటాయని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వేళ అందులోనూ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేటు తెస్తాయని అమిత్‌షా సుతిమెత్తగా మందలించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆలస్యంగానైనా నష్టనివారణ చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంతమేరకు కుదుటపడుతోంది. కాగా కర్ణాటక హిజాబ్‌ వివాదం జాతీయస్థాయిలోనూ దుమారం లేపడంతో నోబుల్‌ శాంతిపురస్కార గ్రహీత మలాలా సైతం తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేయడంతో జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలు ఆత్మరక్షణలో పడ్డారు. మరోవైపు కోస్తా జిల్లాల్లో ఇంకా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న కారణంగానే విద్యాసంస్థలకు సెలవులను శనివారం వరకు పొడిగించినట్టు తెలుస్తోంది. 


రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు: సీఎం 

బయట రాష్ట్రాల నుంచి సోషల్‌ మీడియాలో హిజాబ్‌ వర్సెస్‌ కాషాయం వివాదానికి సంబంధించి రెచ్చగొట్టే కథనాలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై గురువారం ప్రత్యేకంగా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా అందరం గౌరవిద్దామన్నారు. అత్యంత సున్నితమైన అంశంలో విద్యార్థులు ఐకమత్యంగా ఉన్నందుకు ముఖ్యమంత్రి ప్రశంసించారు. కొన్ని కళాశాలల్లో మాత్రమే రెండు రోజులుగా అనుకోని ఘటనలు, వాదవివాదాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చాయని పేర్కొన్న ఆయన జరిగిందేదో జరిగింది... అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతిసామరస్యాలకు నెలవైన కర్ణాటకలో ప్రత్యేకించి విద్యాసంస్థల్లో ఘర్షణ, అశాంతి ఏమాత్రం మంచిది కాదన్నారు. కాగా తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి శుక్రవారం జిల్లాధికారులతోనూ, ఎస్పీలతోనూ విద్యాశాఖ అధికారులతోనూ వీడియో సదస్సు నిర్వహించి సమీక్షించనున్నారు.  హైకోర్టు తాజా సూచనల నేపథ్యంలో హిజాబ్‌ ధరించి వచ్చే విద్యార్థినులను తరగతులకు అనుమతించే అవకాశం లేదు కాబట్టి వారిని కొంతకాలమైనా సహకరించేలా ఒప్పించాలని సీఎం కోరనున్నారు. అవసరమైతే ముస్లిం మత పెద్దలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో తీవ్రంగా కుదిపేసిన హిజాబ్‌ వర్సెస్‌ కాషాయ వ్యవహారాన్ని కొలిక్కితెచ్చేలా సామరస్య పూరితంగా పరిష్కరించేలా ముఖ్యమంత్రి నడుం బిగించారు. ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని మాజీ సీఎం యడియూరప్ప కూడా సీఎంకు సూచించినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-02-11T17:45:11+05:30 IST