- వివిధ శాఖల అధికారులతో చర్చలు
బెంగళూరు: హిజాబ్ వివాదం కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సచివాలయంలో బుధవారం బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. తొలుత ఇంధనశాఖ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి సునిల్‌కుమార్ ఇంధనశాఖ తాజాస్థితిగతులు, గత ఏడాది కేటాయింపులు, ప్రస్తుత ఏడాది అవసరాలను సీఎంకు వివరించారు. అనంతరం రెవెన్యూశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్ హాజరై శాఖ పరిస్థితిని సమగ్రంగా సీఎంకు వివరించా రు. అనంతరం సమాచారశాఖ అధికారులతోనూ సీఎం మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పీవీ రవికుమార్, అదనపు ముఖ్యకార్యదర్శి కుమార్‌నాయక్, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఐఎన్‌ఎస్ ప్రసాద్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీజే పుట్టస్వామి, అదనపు కార్యదర్శి వందితాశర్మ, సమాచారశాఖ ప్రధాన కార్యదర్శి మంజునాథ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నాలుగుగంటలకుపైగా శాఖల సమీక్ష జరిపిన సీఎం గురువారం కూడా కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రి చేనేత, చక్కెర, కార్మిక, రవాణా, షెడ్యూల్డు కులాలు, తరగతులు, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, భారీ పరిశ్రమలు, చిన్నపరిశ్రమల శాఖ అధికారులతోనూ సంబంధిత శాఖల మంత్రులతోనూ చర్చలు జరపనున్నారు.
ఇవి కూడా చదవండి