Abn logo
Sep 24 2021 @ 00:29AM

నిరుపేదలకు సంజీవనిగా సీఎం సహాయనిధి

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

- మంత్రి గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌, సెప్టెంబరు 23: రాష్ట్రంలో సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవనిగా మారిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌  మున్సిపల్‌ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు 3.19 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్రంలో అన్ని పథకాలు ఆగకుండా అమలవుతున్నాయన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించి ఇంజనీరింగ్‌, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులను పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు గాను 25 కోట్లు మంజూరు కాగా మిషన్‌ భగీరథ కోసం 10కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. 15 కోట్ల నిధులతో బ్రిడ్జి, కమ్యూనిటీ భవనాలకు సంబంధించిన టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. పనులు జరిగే చోట బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, కమిషనర్‌ వెంకన్న, అధికారులు పాల్గొన్నారు.