మార్కెట్‌పై ‘బేర్‌’ పట్టు ఖాయం

ABN , First Publish Date - 2022-09-30T06:17:59+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ‘బేర్‌’మంటోంది. నిఫ్టీ ఇప్పటికే 16,818 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 16,800 పాయింట్ల దిగువన ముగిస్తే.. ఈ ఏడాది జూన్‌లో ఉన్న ట్లుగానే.. మార్కెట్లో మరింత పతనం

మార్కెట్‌పై ‘బేర్‌’ పట్టు ఖాయం

30% వరకు తగ్గనున్న నిఫ్టీ.. మళ్లీ ఎఫ్‌పీఐల అమ్మకాలు : సీఎల్‌ఎస్‌ఏ


న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ‘బేర్‌’మంటోంది. నిఫ్టీ ఇప్పటికే 16,818 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 16,800 పాయింట్ల దిగువన ముగిస్తే.. ఈ ఏడాది జూన్‌లో ఉన్న ట్లుగానే.. మార్కెట్లో మరింత పతనం తప్పదని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దిద్దుబాటు ఎంత లేదన్నా 30 శాతం వరకు ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ ఎస్‌ఏ గురువారం విడుదల చేసిన ఒక  నివేదికలో వెల్లడించింది. 


అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం 

అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు.. భారత స్టాక్‌ మార్కెట్‌కు శాపంగా మారింది. రేట్ల పెంపుతో అమెరికా-భారత ప్రభుత్వ రుణ పత్రాల వడ్డీ రేట్ల వ్యత్యాసం భారీగా తగ్గింది. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితి ఉండే అమెరికా-భారత ప్రభుత్వ రుణ పత్రాల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం 13 ఏళ్ల కనిష్ఠ స్థాయి 3.3 శాతం మాత్రమే. దీంతో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు భారత ఈక్విటీ, డెట్‌ మార్కెట్‌ కంటే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 


ఎగ్జిట్‌ బాటలో ఎఫ్‌పీఐలు

గత వారం రోజులుగా భారత మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలకు ఇదే ప్రధాన కారణం. ఆగస్టులో రూ.51,204 కోట్లు కుమ్మరించిన ఈ సంస్థలు ఈ నెలలో ఇప్పటికే దాదాపు రూ.10,000 కోట్ల విలువైన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడి స్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటు క్షీణించటం, ఇతర ప్రధాన మార్కెట్లతో పోలిస్తే, భారత మార్కెట్లో ప్రధాన కంపెనీల షేర్ల ధరలు ఎక్కువగా ఉండడమూ నిఫ్టీని మరింత కుదిపేయనుందని సీఎల్‌ఎస్‌ఏ  నివేదిక పేర్కొంది. 


కుప్పకూలిన వాల్‌స్ట్రీట్‌ 

గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ మరింత ‘బేర్‌’ మంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక దశలో 2.75 శాతం వరకు నష్టపోయి రెండేళ్ల కనిష్ఠ స్థాయిని తాకింది. నాస్‌డాక్‌ కూడా 3.70 శాతం నష్టపోయి 10,640 పాయింట్లను తాకింది. వడ్డీ రేట్లు పెంపు, ఆర్థిక మాంద్యం భయాలు ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటికే అమెరికా స్టాక్‌ మార్కెట్‌ 23 శాతం వరకు నష్టపోయింది. మాంద్యం భయంతో మరో 40 శాతం వరకు నష్టపోయే ప్రమాదం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 


ఆగని మార్కెట్‌ పతనం

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి ఉండే ధోరణి అనుసరించడంతో మార్కెట్లు వరుసగా ఏడో రోజున కూడా  నస్టాల బాటలోనే సాగాయి. ఆరంభంలో సాధించిన లాభాలు కూడా ఆవిరైపో గా చివరికి సెన్సెక్స్‌ 188.32 పాయింట్ల నష్టంతో 56,409.96 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 40.50 పాయింట్ల నష్టంతో 16,818.10 వద్ద క్లోజైంది. మార్కెట్‌ ఇప్పటికే ఓవర్‌ సోల్డ్‌ స్థితిలో ఉందని.. ఆర్‌బీఐ గనుక వడ్డీ రేటు పెంచితే శుక్రవారం ట్రేడింగ్‌ ఇంట్రాడేలో నెగెటివ్‌ మొగ్గుతో భారీ ఆటుపోట్ల నడుమ సాగవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అన్నారు. 

Updated Date - 2022-09-30T06:17:59+05:30 IST