Abn logo
Sep 17 2020 @ 02:59AM

ఆరున్నరేళ్లలో ఉపాధినిచ్చే ఒక్క సంస్థనైనా తెచ్చారా?

మా వల్ల జరుగుతున్న అభివృద్ధిని మీదిగా చెప్పుకొంటున్నారు!..

కాంగ్రెస్‌ ప్రభుత్వాలతోనే హైదరాబాద్‌ అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ సర్కారు చేసింది శూన్యం

శాసనసభలో భట్టివిక్రమార్క ధ్వజం


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్లు అయింది. హైదరాబాద్‌లో గానీ, నగరం చుట్టుపక్కల గానీ పెద్ద ఎత్తున ఉపాధిని కలిగించే ఒక్క సంస్థ లేదా వ్యవస్థను తీసుకువచ్చారా?’’ అంటూ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్థలు, వ్యవస్థల కారణంగానే అభివృద్ధి ఆటోమెటిక్‌గా జరుగుతోందని.. దాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనదిగా చెప్పుకుంటోందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాలపై శాసనసభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో భట్టి మాట్లాడారు. హైదరాబాద్‌ మహానగరం ఇంత గొప్పగా తయారు కావడానికి ఇక్కడ ఉన్న అనేక సంస్థలు, వ్యవస్థలే కారణమన్నారు. ఇవి వచ్చాయి కాబట్టే ఉపాధి కోసం పెద్ద ఎత్తున జనాభా వచ్చారని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. మాటలకే పరిమితమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని.. భట్టివిక్రమార్క మాయాలోకంలో విహరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పటిస్తున్నారని వ్యాఖ్యానించారు. దానికి భట్టి విక్రమార్క స్పందిస్తూ ‘‘మేం భ్రమల్లో లేం. మీరే ప్రజల్ని భ్రమల్లో ఉంచి పబ్బం గడుపుకుంటున్నారు.


అది పటాపంచలయ్యే రోజులు దగ్గరికి వచ్చాయి’’ అన్నారు. నగరానికి బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌లను తీసుకొచ్చింది కాంగ్రెస్‌ సర్కారా..? లేక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. వీటితో పాటు మిథానీ, ఎన్‌ఎ్‌ఫసీ, ఐడీపీఎల్‌, సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్‌ఎండీసీ, ఎంజీఆర్‌ఐ తదితర సంస్థలనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే తీసుకొచ్చాయని గుర్తుచేశారు. ఇవన్నీ వచ్చాయి కాబట్టే అవకాశాలు పెరిగి హైదరాబాద్‌ మహానగరంగా విస్తరించిందన్నారు. హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఇంటర్‌ నేషనల్‌ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వంటివీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయన్నారు. నగరానికి కృష్ణా వాటర్‌ మూడు దశలు, గోదావరి జలాలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకువచ్చిందన్నారు. హౌసింగ్‌ బోర్డు ద్వారా కాలనీలను కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయని, జర్నలిస్టులు సహా ఇళ్లు, ఇళ్ల స్థలాలనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఇచ్చాయన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ ఇవ్వలేదని గుర్తుచేశారు. మెప్మా ఎటుపోయిందో తెలియదన్నారు. ట్యాంక్‌బండ్‌ను సుందరంగా మారుస్తానన్నారని, కానీ ఇంకా దుర్వాసన అలాగే వస్తోందని చెప్పారు. మెట్రో రైలు కూడా కాంగ్రెస్‌ ఆలోచనేనని, కనీస టికెట్టు తాము రూ.8కి ఒప్పందం చేసుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని రూ.18 చేసిందన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలకు అప్పు పుట్టే పరిస్థితి లేదని, ఎల్‌ఆర్‌ఎస్‌పై పునరాలోచన చేసి క్రమబద్ధీకరణ రుసుమును సగానికి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement