చేనేతలను మింగేస్తున్న పవర్‌లూమ్స్‌

ABN , First Publish Date - 2022-08-07T06:49:31+05:30 IST

పడుగు, పేకల కల నేత చేనేత. సప్తవర్ణ శోభితమైన రంగులతో ఆ కళాకారులు సృష్టించిన, సృష్టిస్తున్న అద్భుతాలు ఎన్నెన్నో. అందుకే నేత కళాకారులకు చేనేతకు విడదీయరాని పో(పే)గు బంధం ఉంది.

చేనేతలను మింగేస్తున్న పవర్‌లూమ్స్‌

జీఎస్టీ దెబ్బతో కుదేలైన చేనేత పరిశ్రమ

నేడు జాతీయ చేనేత దినోత్సవం

అమలాపురం రూరల్‌ :  పడుగు, పేకల కల నేత చేనేత. సప్తవర్ణ శోభితమైన రంగులతో ఆ కళాకారులు సృష్టించిన, సృష్టిస్తున్న అద్భుతాలు ఎన్నెన్నో. అందుకే నేత కళాకారులకు చేనేతకు విడదీయరాని పో(పే)గు బంధం ఉంది. తరతరాల నాటి చేనేత రంగాన్ని నాటి నుంచి నేటి వరకు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నా కళాకారులు మాత్రం కాపాడుకుంటూనే వస్తున్నారు. వారి సృజనాత్మకశక్తితో తయారవుతున్న వస్త్రాలను రోజులు గడవకముందే మరమగ్గాలపై కళ్ల ముందే తయారు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. చేనేతలకు మాత్రమే రిజర్వు చేసిన వస్త్రాలను మరమగ్గాలపై తయారు చేస్తూ బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నా అధికారులు, పాలకులు చోద్యం చూస్తున్నారు. కార్మికులకు ఉపాధి కల్పించే చేనేత సహకార సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కొన్ని సంఘాలైతే కార్మికులకు పనులు కూడా కల్పించలేని పరిస్థితి. చేనేత సంఘాల నుంచి మాతృసంస్థ ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు జిల్లాలో సొసైటీలకు కోట్లాది రూపాయల మేర బకాయిలు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగులో ఉన్నాయి. పావలా వడ్డీ రాయితీ కూడా లేదు. యార్న్‌ సబ్సిడీ సొమ్ముల బకాయిల చెల్లింపు లూ నిలిచిపోయాయి. దాంతో లాభాల బాటలో ఉండే సహకార సంఘాలు సైతం దైన్యస్థితికి చేరుకున్నాయి. సుమారు ఐదేళ్లుగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ప్రభుత్వం నియమించిన సభ్యులే పాలన సాగిస్తూ సంఘాలను భారంగా నెట్టుకొస్తున్నారు. 

ఆ టక్కూటిక్కూ శబ్దాలు ఏవీ..

ఏ చేనేత గ్రామమెళ్లినా ఒకప్పుడు కోడి కూయకముందే టక్కూటిక్కూ.. మని శబ్దాలు విని పించేవి. తెల్లవారకముందే మగ్గం గుంటల్లోకి దిగి వంతుల వారీగా కుటుంబ సభ్యులు చేసే నేత పని నేడు కనిపించట్లేదు. ప్రస్తుతం జిల్లాలో 23 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. నేతలు నేసే కళాకారులతోపాటు రంగుల అద్దకం, సరిజట్లు, జంత్రంపని, నూలు వడకడం.. ఇలా అనుబంధ రంగాల్లో కులమతాలకు అతీతంగా ఎందరో పనిచేస్తున్నారు. అయితే వారికి ఉపాధి కల్పించలేని పరిస్థితుల్లో చేనేత సంఘాలు కాలం వెళ్లదీస్తున్నాయి. 

ఆ గ్రామాలు ప్రత్యేకం..  

చేనేతల సృజనాత్మకతకు జిల్లాలోని ఎన్నో గ్రామాలు అద్దంపడుతున్నాయి. హసన్‌బాద్‌లో తయారయ్యే దుప్పట్లు, తువ్వాళ్లు, కె.జగన్నాఽథపురం, విలసవిల్లిల్లో పంజాబీ డ్రెస్‌ మెటీరియల్స్‌, పందలపాకలో తయారయ్యే కుప్పడం కండువాలు, పంచెలు, బండారులంక, జగ్గన్నపేట, కాతేరు, కేశనపల్లి, మండపేట, మోరి, ముమ్మిడివరం, పెనుమల్ల, పుల్లేటికుర్రు, రాయవరంలలో తయారయ్యే బుటా నేత చీరలు, జాకార్డ్‌, లుంగీలు, తివాచీలతోపాటు దివాన్‌సెట్లు, పిల్లోకవర్లు, కుప్పడం పంచెలు మంచి గుర్తింపు పొందాయి. రూ.300 నుంచి రూ.2 లక్షలు విలువచేసే చేనేత చీరలను తయారు చేస్తున్నారు.

పవర్‌లూమ్స్‌తో ఉపాధిపై దెబ్బ

మగ్గంపై నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందిన చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, ఇతర ఉత్పత్తులు బయటకు వస్తే చాలు వెంటనే అవే డిజైన్లు మరమగ్గాలపైకి ఎక్కించేసి కార్మి కుల కడుపు కొడుతున్నారు. చేనేత వస్త్రాలకు బదులు పవర్‌లూమ్స్‌, జెట్‌ లూమ్స్‌పై తయారైన వస్త్రాలను మోసం చేసి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వ్యాపా రులు అనుసరిస్తున్న విధానాలతో చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతింటోంది. వ్యాపారుల ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేనేత లోగోను విడుదల చేసినప్పటికీ అవి కూడా జెట్‌లూమ్స్‌కు చేరిపోవడం దారుణం. ఇక చేనేత సహకార సంఘాలకు 2020 సెప్టెం బరు నుంచి ఆప్కో బకాయిల చెల్లింపులు నిలి చిపోయాయి. ఒక్కో సంఘానికి రూ.40 లక్షల నుంచి రూ.1.50 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. 

స్వాతంత్రోద్యమ స్ఫూర్తినింపిన చేనేత..

చేనేత రంగం గుర్తుకు రాగానే  స్వాతంత్రోద్యమంలో విదేశీ వస్త్రాలను తగులబెట్టిన ఘటనలు, స్వదేశీ వస్త్రాలనే ధరించాలంటూ రాట్నంపై నూలు వడికిన జాతిపిత మహాత్మాగాంధీ కళ్లముందు కదలాడతారు. చరిత్రలో, స్వేచ్ఛా స్వాతంత్ర ఉద్యమాల్లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న చేనేత రంగం నేడు నిర్లక్ష్యపు నీడలో మూలనపడిపోయింది. మగ్గంపై ఆధారపడిన బతుకులెన్నో చేతినిండా పనిలేక ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నేడు నెలకొంది. దీంతో చేనేత కార్మికుల వారసులు నేడు ఇతర వృత్తుల్లోకి వలసలు పోతున్నారు. రాజకీయ నేతల నిర్లక్ష్యంతో చేనేతకు చట్టబద్ధ రక్షణ అమలు కాక దశాబ్దాల కాలంగా చేనేత చివికి చితికిపోయింది. అయినా 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ఆ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తోంది.


Updated Date - 2022-08-07T06:49:31+05:30 IST