గుబులు పుట్టిస్తున్న మబ్బులు

ABN , First Publish Date - 2021-04-21T06:08:14+05:30 IST

వాతావరణంలో మార్పులు రైతులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం మబ్బులు పట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

గుబులు పుట్టిస్తున్న మబ్బులు
మబ్బులు పడుతుండటంతో అన్నారం బ్రిడ్జి వద్ద కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై కవర్లు కప్పుతున్న రైతులు

లారీలు రాక నిలిచిన ఎగుమతి

కొనుగోలు కేంద్రాల్లో  పేరుకపోయిన నిల్వలు

పెన్‌పహాడ్‌, ఏప్రిల్‌ 20: వాతావరణంలో మార్పులు రైతులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం మబ్బులు పట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన రాశులపై కప్పడానికి టార్ఫాలిన్లు సరఫరా అందజేయకపోవడంతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. అన్నారం బ్రిడ్జి వద్ద సంఘ బంధం-1 ధాన్యం కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతుల సౌకర్యం కల్పించలేదు. దీనికి తోడు నాలుగు రోజుల నుంచి ధాన్యం తరలించే లారీలు రాకపోవడంతో కాంటా వేసిన మూడు వేలకు పైగా బస్తాలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఈ కేంద్రంలో రైతులకు, లారీ డ్రైవర్లకు మధ్య జరిగిన గొడవ కారణంగా ధాన్యం ఎగుమతి చేయటం లేదని నిర్వాహకులు తెలిపారు. దీనికితోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 వేల బస్తాల ధాన్యం రాశులుగా పోశారు. 


టార్ఫాలిన్లను సరఫరా చేయాలి : మీసాల రూతమ్మ, అన్నారం బ్రిడ్జి గ్రామ రైతు

మబ్బులను చూసి భయం వేస్తోందని పెన్‌పహాడ్‌ మండలం అన్నారం బ్రిడ్జి గ్రామ మహిళా రైతు మీసాల రూతమ్మ అన్నారు. వర్షం వస్తే రైతులు వద్ద సరిపోను టార్ఫాలిన్లు లేక ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కాంటాలు జరిపి, ఎగమతి చేయాలన్నారు. ధాన్యం రాశులు తడవకుండా ప్రభుత్వం టార్పాలిన్లను సరఫరా చేయాలన్నారు. 

 


Updated Date - 2021-04-21T06:08:14+05:30 IST