Amarnath Yatra: కుండపోత వర్షంతో భక్తులకు ఇక్కట్లు... 13 మంది మృతి, 40 మంది గల్లంతు...

ABN , First Publish Date - 2022-07-09T15:59:37+05:30 IST

జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో కురుస్తున్న భారీ వర్షాలు అమర్‌నాథ్

Amarnath Yatra: కుండపోత వర్షంతో భక్తులకు ఇక్కట్లు... 13 మంది మృతి, 40 మంది గల్లంతు...

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో కురుస్తున్న భారీ వర్షాలు అమర్‌నాథ్  (Amarnath) భక్తులకు అనేక ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. వర్షాలు, వరదల్లో చిక్కుకున్నవారిలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 40 మంది ఆచూకీ తెలియడం లేదు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షాల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  శుక్రవారం రాత్రి కూడా అధికారులు, సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


శ్రీనగర్‌లోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు కుండపోత వర్షం కురిసింది. ఆ తర్వాత కొండ చరియలు విరిగిపడ్డాయి, వరదలు సంభవించాయి. శనివారం మరింత తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గాయపడిన 11 మంది భక్తులను సైనిక హెలికాప్టర్లలో  బల్తల్ బేస్ కేంప్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యవేక్షిస్తున్నారు. 


గాయపడిన కొందరు భక్తులకు అమర్‌నాథ్ గుడి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవసరమైతే శ్రీనగర్ ఆసుపత్రికి తరలిస్తామని ఓ వైద్యుడు చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వైద్యులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. 


సైన్యం ఇచ్చిన ట్వీట్‌లో శనివారం ఉదయం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురు భక్తులను తరలించినట్లు తెలిపారు. నీలగ్రార్ హెలిపాడ్ వద్ద ఉన్న రోగులకు వైద్యులు చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. కొండల్లో చిక్కుకున్నవారిని కాపాడే బృందాలు, ఆచూకీ తెలుసుకునే బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. శుక్ర-శనివారాల మధ్య రాత్రి నిర్వహించిన సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను కూడా సైన్యం పోస్ట్ చేసింది. సైనిక జాగిలాలను, 10 సైనిక సహాయక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపింది. 


ప్రత్యేక దళాల సిబ్బంది, సరిహద్దు భద్రతా దళం (BSF), జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా పాల్గొంటున్నట్లు సైనికాధికారులు ప్రకటించారు. గాలింపు కొనసాగుతోందని, భక్తులను కాపాడగలుగుతామని ఆశిస్తున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. వరద ప్రవాహం నుంచి కొందరు సాధారణ పౌరులను కాపాడామని, వారికి ప్రథమ చికిత్స జరిగిందని, వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. తప్పిపోయినవారిని గుర్తించేందుకు జాగిలాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 


వరదల వల్ల డజన్లకొద్దీ గుడారాలు, సామూహిక భోజనశాలలు కొట్టుకుపోయాయి. 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళం డైరెక్టర్ హసీబ్ ఉర్ రహమాన్ చెప్పారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పారు. 


ఇదిలావుండగా, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం, ఈ వరదల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 




Updated Date - 2022-07-09T15:59:37+05:30 IST