క్యారీ బ్యాగ్‌పై రూ.12 ఛార్జీ విధింపు .. ఏపీలో ఓ రిటైలర్‌కు రూ.21 వేల భారీ జరిమానా

ABN , First Publish Date - 2022-04-24T03:17:37+05:30 IST

విశాఖపట్నం: క్యారీ బ్యాగ్‌పై రూ.12 ఛార్జీ విధించిన ఓ వస్త్ర రిటైలర్‌కు ఏకంగా రూ.21 వేల జరిమానా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం జిల్లా వినియోగదారుల

క్యారీ బ్యాగ్‌పై రూ.12 ఛార్జీ విధింపు .. ఏపీలో ఓ రిటైలర్‌కు రూ.21 వేల భారీ జరిమానా

విశాఖపట్నం: ప్రకటనలతో కూడిన క్యారీ బ్యాగ్‌పై రూ.12 ఛార్జీ విధించిన ఓ వస్త్ర రిటైలర్‌కు ఏకంగా రూ.21 వేల జరిమానా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఈ మేరకు ఇటివలే ఆదేశాలు ఇచ్చింది. వైజాగ్‌ నివాసి, న్యాయవాది సీపన రామా రావు ఓ వస్త్ర రిటైలర్ షోరూంలో జులై 14, 2019న రూ.628.96 విలువైన దుస్తులు కొనుగోలు చేశాడు. దస్తులను క్యారీ బ్యాగ్‌లో పెట్టిన క్యాషియర్ బ్యాగ్‌కు రూ.12 ఛార్జ్ చెల్లించాలని కోరాడు. క్యారీ బ్యాగ్ ఛార్జీలు చెల్లించేందుకు రామారావు నిరాకరించాడు. చెల్లించబోనని చెప్పాడు. క్యాషియర్ డిమాండ్ చేస్తుండడంతో రూ.12 చెల్లించాడు. అనంతరం మేనేజర్‌ను సంప్రదించాడు. ప్రకటనలు ఉన్న క్యారీ బ్యాగ్‌పై ఛార్జీలు విధించడం చట్టవిరుద్ధమని మేనేజర్‌కి రామారావు వివరించినా ఫలితం రాలేదు. పైగా రామారావుపైనే మేనేజర్ అరిచాడు. దీంతో తనను మానసిక హింసకు గురిచేసిన రిటైలర్ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ స్థానిక వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం రిటైలర్‌కు భారీ షాకిచ్చింది. కస్టమర్‌ను మానసికంగా హింసించినందుకు రూ.21 వేలు, లీగల్ ఖర్చులకు రూ.1500 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అంతేకాదు క్యారీ బ్యాగ్‌పై విధించిన రూ.12 కూడా చెల్లించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ సభ్యులు రహిమున్సీసా బెగం, ప్రిసైడింగ్ మెంబర్ వర్రి క్రిష్ణ మూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - 2022-04-24T03:17:37+05:30 IST