పాన్ నమిలి కిటికీలోంచి ఉమ్మేసిన వ్యక్తి.. సరిగ్గా అదే సమయంలో వచ్చిన ఓ యువకుడిపై పడటంతో జరిగిన ఘోరమిది..!

ABN , First Publish Date - 2021-11-02T00:03:31+05:30 IST

అతడు దుస్తుల వ్యాపారి. కొంత మంది యువకులతో కలిసి అద్దె గదిలో ఉంటూ.. వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయగా వచ్చే డబ్బులలో కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపిస్తూ మిగిలిన డబ్బులను సొంత ఖర్చులకు వాడుకునేవాడు. ఆ

పాన్ నమిలి కిటికీలోంచి ఉమ్మేసిన వ్యక్తి.. సరిగ్గా అదే సమయంలో వచ్చిన ఓ యువకుడిపై పడటంతో జరిగిన ఘోరమిది..!

ఇంటర్నెట్ డెస్క్: అతడు దుస్తుల వ్యాపారి. కొంత మంది యువకులతో కలిసి అద్దె గదిలో ఉంటూ.. వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేయగా వచ్చే డబ్బులలో కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపిస్తూ మిగిలిన డబ్బులను సొంత ఖర్చులకు వాడుకునేవాడు. ఆయనకు పాన్ నమిలే అలవాటు ఉంది. ఆ అలవాటే అతడి కొంప ముంచింది. వంటచేస్తూ పాన్ నమిలి కిటికీలోంచి బయటకు ఉమ్మేయబోయాడు. అదికాస్తా అటువైపుగా వచ్చిన ఓ యువకుడిపై పడింది. దీంతో రచ్చ మొదలైంది. గొడవకాస్తా తారా స్థాయికి చేరడంతో ఘోరం జరిగిపోయింది. కాగా.. ఇంతకూ అక్కడ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. 



ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఇషాన్ మాలిక్ అనే వ్యక్తి పొట్టకూటి కోసం బిహార్ వచ్చాడు. శివాన్ ప్రాంతంలో కొంత మందితో కలిసి గదిని అద్దెకు తీసుకుని బట్టల వ్యాపారం ప్రారంభించాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా వ్యాపారాన్ని ముగించుకుని, ఇషాన్ రాత్రి తన గదికి తిరిగొచ్చాడు. కొద్ది సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత పాన్ వేసుకుని వంట ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడు.. నమిలిన పాన్‌ను కిటికీ నుంచి బయటకు ఉమ్మేయబోయాడు. అయితే అదికాస్తా.. అటుగా వస్తున్న ఓ యువకుడిపై పడింది. దీంతో ఆ యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు.


ఇషాన్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే గొడవ పెద్దదైంది. దీంతో సదరు యువకుడు.. ఇషాన్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇషాన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఇషాన్ ప్రాణాలు కోల్పోయినట్టు తేల్చేశారు. కాగా.. ఈ ఘటనసై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇషాన్‌పై కాల్పులు జరిపిన యువకుడిని జావెద్ మియాన్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 




Updated Date - 2021-11-02T00:03:31+05:30 IST