మూసేశారా.. ఎత్తేశారా....?

ABN , First Publish Date - 2022-04-25T04:59:28+05:30 IST

జిల్లా ఎలాగో పోయింది... ఉన్న ఆఫీసులను కూడా తీసివేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

మూసేశారా.. ఎత్తేశారా....?
మూసివేసిన డివిజనల్‌ పౌరసంబంధాల శాఖ కార్యాలయం

నెల రోజులుగా మూసివేసిన కార్యాలయం

కడప, రాయచోటికి సిబ్బంది తరలింపు 

పౌరసంబంధాల శాఖ డివిజనల్‌ కార్యాలయానికి మంగళం


రాజంపేట, ఏప్రిల్‌ 24 : జిల్లా ఎలాగో పోయింది... ఉన్న ఆఫీసులను కూడా తీసివేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఉన్న అన్ని డివిజనల్‌ కార్యాలయాలన్నీ రాజంపేటలో ఉన్నాయి. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోగా ఉన్న డివిజనల్‌ కార్యాలయాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోవడం విచారకరం. ఇందులో ఇప్పటికే అటవీ, వాణిజ్య పన్నుల శాఖ, పశుసంవర్థక శాఖ ఇలా డివిజనల్‌ శాఖలన్నీ లేకుండా చేశారు. ఇక ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించే ప్రధానమైన సమాచార శాఖ డివిజనల్‌ కార్యాలయం రాజంపేటలో 50 సంవత్సరాలకు పైబడి ఉంది. ఈ కార్యాలయంలో మొదటి నుంచి 10 మంది పైబడి సిబ్బంది ఉండేవారు. డివిజనల్‌ పౌర సంబంఽధాల శాఖాధికారి, పబ్లిసిటీ అధికారి, యూడీసీ, ఎల్‌డీసీ, ఆపరేటర్‌, ఇద్దరు అటెండర్లు పనిచేసేవారు. వీరు నిత్యం డివిజనల్‌ కేంద్రంలో అన్ని శాఖల ప్రభుత్వ అభివృద్ధి పథకాలను, సంక్షేమ పథకాలను ఇలా ప్రభుత్వానికి, ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని తమ కార్యాలయం ద్వారా ప్రచారం చేసేవారు. ఇక్కడ ప్రతినిత్యం వార్తా పత్రికలు, దినపత్రికలు ఇతర ప్రభుత్వ సమాచార కరపత్రాలు ఉంచి పాఠకుల కోసం ప్రత్యేక ఛాంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చి అందరూ పత్రికలను, వారపత్రికలను, ఇతర సమాచారాలను తెలుసుకునేవారు. ఇక అన్ని ప్రసార సాధనాలకు సంబంధించిన పాత్రికేయులకు ఈ కేంద్రం ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయం. అటువంటి ఈ శాఖ నెల రోజులుగా పనిచేయడం లేదు. ఈ శాఖ రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో ఓ అద్దె భవనంలో కొనసాగుతుండేది. ప్రస్తుతం నెల రోజులుగా ఈ శాఖ మూసివేసి ఉంది. ఇదేమని అడిగితే ఈ శాఖను ఎప్పుడో ఎత్తేశారని సంబంధిత శాఖాధికారులే తమ పేర్లు చెప్పవద్దని సెలవిస్తున్నారు. సిబ్బంది అందరినీ కడపకు, రాయచోటికి పంపించేశారు. ఎప్పుడు జిల్లా కేంద్రం కాలేదో... అప్పటికప్పుడే ఈ డివిజనల్‌ కార్యాలయాన్ని గప్‌చు్‌పగా తరలించేశారు. అయితే డివిజనల్‌ పౌరసంబంధాల శాఖకు సంబంధించిన నేమ్‌బోర్డు, కొంత ఫర్నీచర్‌ ఇక్కడ ఉంది. మిగిలిన కార్యాలయ వ్యవహారం పూర్తిగా మూసివేసి ఉంది. లోపల కార్యాలయంతో పాటు ప్రధాన గేటుకు కూడా తాళం వేశారు. కనీసం అద్దె కట్టడానికి కూడా ఆ శాఖలో నిధులు లేవని, కేవలం ఉనికి కోసమే ఈ శాఖను ఇన్ని రోజులు కొనసాగించారని జిల్లా కేంద్రం కానందున ఇక్కడ ఈ శాఖ ఉండి ప్రయోజనం లేదని తరలించేశారని పేర్కొన్నారు. ఈ విధంగా అత్యంత ప్రధానమైన పౌరసంబంధాల శాఖను తరలించుకుపోవడంతో రాజంపేటలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


సిబ్బందిని కడప, రాయచోటికి తరలించాం..

- పురుషోత్తం, జిల్లా పౌర సంబంధాల శాఖాధికారి, అన్నమయ్య జిల్లా

ప్రస్తుతం రాజంపేటలో ఉన్న డివిజనల్‌ పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని అంతా కడప, రాయచోటికి తరలించాం.. ప్రస్తుతం రాజంపేట డివిజనల్‌ కార్యాలయం మూసివేశాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం మేరకు రాజంపేట కార్యాలయాన్ని మూసివేశాం. గతంలో డివిజనల్‌ పౌర సంబంధాల శాఖాధికారితో పాటు ప్రచార శాఖ అధికారి, క్లర్క్‌లు అనేకమంది పనిచేసేవారు. నేను కూడా గతంలో అక్కడే పనిచేశాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేశాం. 


కార్యాలయాన్ని తరలిస్తే ఆందోళనలు చేస్తాం

- టి.లక్ష్మీనారాయణ, న్యాయవాది, రాజంపేట. 

ఎన్నో ఏళ్లుగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజంపేట డివిజనల్‌ పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని మూసివేయడం అన్యాయం. ఉన్న డివిజనల్‌ కార్యాలయాలను ఈ విధంగా తరలిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాజంపేట డివిజనల్‌ పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని తిరిగి తెరిపించాలి. లేకపోతే ప్రజల తరపున ఆందోళన కార్యక్రమాలు తిరిగి నిర్వహిస్తాం. 


తరలించవద్దని ముఖ్యమంత్రిని కోరాం

- మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట

రాజంపేటలోని ఏ ఒక్క డివిజనల్‌ కార్యాలయాన్ని తరలించవద్దని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరాము. ఈ మేరకు వినతిపత్రం కూడా ఇచ్చాము. ప్రస్తుతం రాజంపేట డివిజనల్‌ పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని మూసివేసిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. దీనిపై వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో డివిజనల్‌ కార్యాలయాన్ని తరలిపోకుండా చర్యలు తీసుకొని తిరిగి కార్యాలయాన్ని తెరిపిస్తాను. దీనిపై ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇక్కడి కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. 

Updated Date - 2022-04-25T04:59:28+05:30 IST