మహా మాయ

ABN , First Publish Date - 2022-06-18T06:44:57+05:30 IST

బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆ సామాజికవర్గ విద్యార్థులు దేవాలయంగా భావిస్తారు. వసతి గృహాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితరాల ద్వారా బీసీ విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు

మహా మాయ
బీసీ సంక్షేమశాఖ కార్యాలయం

మహా మాయ

మూసేసిన హాస్టళ్లు తెరిచారట

ఆ పేరిట సిబ్బంది నియామకం

మధ్యవర్తి ద్వారా రూ.1.50 కోట్ల వసూలు

ఆ ఇద్దరికీ.. కొందరు ఉద్యోగులకు వాటా

బీసీ సంక్షేమ శాఖలో మరో బాగోతం


అనంతపురం ప్రెస్‌క్లబ్‌ : బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆ సామాజికవర్గ విద్యార్థులు దేవాలయంగా భావిస్తారు. వసతి గృహాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితరాల ద్వారా బీసీ విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. అలాంటి శాఖను అధికారులు బాధ్యతగా నడపాలి. కానీ అక్రమాలకు అడ్డాగా మార్చారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ‘14 ఇయర్స్‌ ఇండసీ్ట్ర’ అధికారి కారణంగా కార్యాలయం భ్రష్టు పట్టిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అవినీతిలో కొంత బయటకు కనిపిస్తుందని, మరికొంత చాపకింద నీరులా సాగిపోతుందని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. 14 ఇయర్స్‌ ఇండసీ్ట్ర అధికారి, అప్పటి డీడీ స్థాయి అధికారి కలిసి చేసిన ఓ కొత్తతరహా అవినీతి బయటపడింది. ఆ శాఖ పరిధిలో ఎప్పుడో మూతపడిన వసతిగృహాల విషయంలో పెద్ద కుంభకోణానికి తెరలేపారు. లేని వసతిగృహాలను ఉన్నట్లు చూపి, ఒక్కో వసతిగృహానికి ముగ్గురు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించి, భారీస్థాయిలో డబ్బు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా దాదాపు 50 మందిని నియమించి రూ.1.50 కోట్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ఆ సిబ్బంది విధులు నిర్వర్తించకున్నా... ఇప్పటికీ జీతాలిస్తుండటం గమనార్హం.


లేనివి ఉన్నట్లు మాయ

-  బీసీ సంక్షేమశాఖ పరిధిలో 113 పాఠశాల, కళాశాల వసతిగృహాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, భవనాలు పాడవడం తదితర సమస్యలతో 15 నుంచి 20 హాస్టళ్లను మూసివేశారు. వాటిని తిరిగి తెరిచేందుకు డైరెక్టరేట్‌స్థాయి అధికారుల అనుమతి తప్పనిసరి. పునఃప్రారంభించాలంటే విద్యార్థులను సర్దుబాటు చేయాలి. ఒక్కో వసతి గృహానికి కుక్‌, కమాటి, వాచమెన.. ఇలా ముగ్గురిని నియమించుకోవాలి.

-  ఔట్‌ సోర్సింగ్‌ కింద తీసుకోవాలంటే ఆ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. అనుకున్న సమయంలో ఫైళ్లను సృష్టించడం, సంతకాలు చేయడం అప్పటి డీడీస్థాయి అధికారి, 14 ఇయర్స్‌ ఇండస్ర్టీ అధికారికి వెన్నతోపెట్టిన విద్య. దీంతో ఉన్నఫలంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. 15-20 వసతిగృహాలను వినియోగంలోకి తెస్తున్నట్లు, ఒక్కో వసతి గృహానికి ముగ్గురిని నియమిస్తున్నట్లు ఫైలు తయారు చేశారు. అప్పటి కలెక్టర్‌ ఆమోదం లభించడంతో మొత్తం 50 మందిని ఔట్‌ సోర్సింగ్‌ కింద నియమించుకు న్నట్లు సమాచారం. ఇలా నిరుప యోగంగా ఉన్న వసతి గృహాలను పునః ప్రారంభిస్తున్నట్లు మాయ చేసి రూ.కోట్ల ల్లోనే కొల్ల గొట్టారని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. 


మధ్యవర్తి ద్వారా..

విశ్వసనీయ సమాచారం మేరకు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి ఓ మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని దందాకు తెరలేపారు. 50 పోస్టులను అమ్మేశారు. వచ్చిన సొమ్ములో ఆ శాఖలోని కొందరు ఉద్యోగులకు వాటా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు తమ వాటా కింద ఐదారు పోస్టులకు పైసలు దండుకున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం రూ.1.50 కోట్లు వసూలు చేశారని సమాచారం. 


ఆర్డర్స్‌ ఎవరిచ్చారు..?

వసతి గృహాల పునఃప్రారంభానికి ఎవరు అనుమతి ఇచ్చారంటే.. ఆ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. ఆ ఇద్దరు అధికారులు ఇలా మాయ చేసినట్లు సమాచారం. ఎవరొస్తారు.. ఎవరు చూస్తారులే.. అని ధీమాగా అక్రమాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది. రీ-ఓపెనింగ్‌ ఆర్డర్స్‌ లేకుండానే, ఓపెన చేసినట్లు చూపి సిబ్బందిని నియమించుకున్నారు. సిబ్బంది నియామకాలకు కలెక్టర్‌ నుంచి గ్రీన సిగ్నల్‌ పొందారు. జిల్లా కేంద్రంలోని ఓ బాలికల వసతిగృహంతో పాటు పుట్లూరు, మామిళ్లపల్లి, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో మూతపడిన వసతిగృహాలను పునఃప్రారంభించినట్లు చూపించారు. అక్రమంగా సిబ్బందిని నియమించి, ఇప్పటికీ నెలనెలా జీతాలు ఇస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.15 వేలు చొప్పున 50 మందికి ప్రజా ధనాన్ని అప్పనంగా చెల్లిస్తున్నారు. ఈ అక్రమాలకు ఎవరు అడ్డుకట్ట వేస్తారు...? బాధ్యులపై చర్యలు ఎవరు తీసుకుంటారు..? అన్న ప్రశ్నలు ఆ శాఖలో వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-06-18T06:44:57+05:30 IST