సరిహద్దులు మూసేయండి

ABN , First Publish Date - 2020-03-30T09:39:43+05:30 IST

వలస కూలీలు, కార్మికుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వలసదార్లు పెద్ద ఎత్తున

సరిహద్దులు మూసేయండి

నగరాలు, హైవేలపై వలసదార్లు తిరగొద్దు

హైవేలపై రవాణాకు మాత్రమే అనుమతి

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

కార్మికుల వేతనాల్లో కోత పెట్టొద్దు

ఇంటి ఓనర్లు అద్దె వసూలు చేయొద్దు 

హైవేలపై వలసదార్లు తిరగొద్దు

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే 14రోజుల క్వారంటైన్‌కు 

సమీప శిబిరాలకు తరలింపు.. అక్కడే సదుపాయాలు

ఆ బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే: కేంద్రం


హైదరాబాద్‌ ,మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వలస కూలీలు, కార్మికుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వలసదార్లు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలుతున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసే విధంగా రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన కూలీలను 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. వలసదార్లకు ఇబ్బందులు కలకుండా ఉండేందుకు జాతీయ రహదారుల పక్కన అన్ని సౌకర్యాలతో కూడిన శిబిరాలను ఏర్పాటు చేయాలని, ఇందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మోదీ ప్రభుత్వం శనివారమే ఆదేశించింది. కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో, వైర్‌సకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా వలసదార్లు ప్రవేశించకుండా సరిహద్దులను మూసివేయాలని తాజాగా ఆదేశించింది. ఈ మార్గదర్శకాల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించి, వారినే బాధ్యులను చేయాలని స్పష్టం చేసింది.


రహదారులపై సరుకు రవాణాను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రాల సీఎ్‌సలు, డీజీపీలతో కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ, హోం సెక్రటరీ అజయ్‌ భల్లా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ  మేరకు ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి పీఎస్‌ శ్రీవాస్తవ కూడా దీనిపై మీడియాతో మాట్లాడారు. పట్టణాలు, నగరాలు, జాతీయ రహదారుల గుండా వలసదార్ల కదలికలు లేకుండా చర్యలు తీసుకోవాలని.. లాక్‌డౌన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ కఠినంగా అమలుచేయాల్సిందేనని స్పష్టం చేశారు. అయినా లాక్‌డౌన్‌ ఉల్లంఘించి.. రోడ్ల మీద ప్రయాణాలు చేసేవారిని కనీసం 14రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచాలని నొక్కి చెప్పారు. ఈ మేరకు వారిని సమీపంలోని శిబిరాలకు తరలించి వైద్య సదుపాయాల మధ్య క్వారంటైన్‌ చేయాలని పేర్కొన్నారు.


ఇందుకు ఆరోగ్య కార్యకర్తలను సిద్ధం చేయాలని సూచించారు.  కాగా లాక్‌డౌన్‌ కాలానికి కార్మికుల వేతనాల్లో యాజమాన్యాలు ఎలాంటి కోత పెట్టకుండా పూర్తి మొత్తం ఇవ్వాల్సిందేనని పీఎస్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అలాగే లాక్‌డౌన్‌ కాలానికి కార్మికుల నుంచి అద్దె వసూలు చేయొద్దని, వారిని, విద్యార్థులను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేయొద్దని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T09:39:43+05:30 IST