అరశాతం అప్పు కోసం పాఠశాలలు మూసేస్తారా?

ABN , First Publish Date - 2022-07-07T09:29:35+05:30 IST

‘జగన్‌రెడ్డి కుమార్తెల్లో ఒకరు పారి్‌సలో, ఒకరు లండన్‌లో చదవాలి. కానీ రాష్ట్రంలోని పేద పిల్లలు వాగులు, వంకలు దాటుకుని స్కూలుకు వెళ్లాలా

అరశాతం అప్పు కోసం  పాఠశాలలు మూసేస్తారా?

  • హేతుబద్ధీకరణ పేరిట 8 వేల బడుల మూత.. దీనిపై జనం తిరగబడాలి
  • జగన్‌ చదువుకోలేదు కాబట్టే..ఇతరులు చదువుకుంటే భరించలేడు
  • మినీ మహానాడులో చంద్రబాబు 


రాయచోటి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌రెడ్డి కుమార్తెల్లో ఒకరు పారి్‌సలో, ఒకరు లండన్‌లో చదవాలి. కానీ రాష్ట్రంలోని పేద పిల్లలు వాగులు, వంకలు దాటుకుని స్కూలుకు వెళ్లాలా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. హేతుబద్ధీకరణ పేరిట ఏపీలోని సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని.. దీనిపై ప్రజలు తిరగబడాలని పిలుపిచ్చారు. రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు వేయడమేనని.. దీనిని తెలుగుదేశం అంగీకరించదని తేల్చిచెప్పారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జరిగిన మినీ మహానాడు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు మూడు కిలోమీటర్లకు ఒక స్కూల్‌, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్‌, మండలానికో కాలేజీ ఏర్పాటు చేశాం. నేను తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివాను. వైఎస్‌ జగన్‌ ఎక్కడ చదివారో చెప్పగలరా? ఆయన చదువుకోలేదు కాబట్టే ఇతరులు చదువుకోవడం ఆయన భరించలేడు. కేంద్రం అర్ధశాతం అప్పు ఇచ్చిందని, దాని కోసం ఈ స్కూళ్లు మూసేశారు. అధికారం కోసం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు పన్నుల పేరుతో పిడుగుద్దులు గుద్దుతున్నారు. మీ ఊర్లలో స్కూళ్లను మూసివేస్తే ఆయా గ్రామాల వైసీపీ నేతలను బహిష్కరించండి’ అని ప్రజలను కోరారు. వారు చేసే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఇంకా ఏమన్నారంటే..


అప్పుల కోసమే సాగు మీటర్లు..

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును టీడీపీ వ్యతిరేకిస్తోంది. అప్పులు తెచ్చుకోవడం కోసమే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లేని సమస్యలన్నీ సృష్టిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.. బెదిరిస్తున్నారు. జనం మినీ మహానాడుకు రాకుండా పుంగనూరులో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. వైసీపీ దొంగల్లారా.. జాగ్రత్త! నేను కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయటకు రాలేరు. పోలీసులను అడ్డం పెట్టుకుని నాటకం ఆడితే ప్రజా తిరుగుబాటు ఎలా చేయాలో నాకు తెలుసు. రాష్ట్రంలో జే బ్రాండ్‌ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నాడు. ఈ మద్యం తాగితే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది. అనారోగ్యంతో అనేక సమస్యలు వస్తాయి. లేబొరేటరీలో పరీక్ష చేయిస్తే అందులో కెమికల్స్‌ ఉన్నాయని రుజువైంది. అంతేకాదు.. ఇప్పుడు చెత్తపై పన్నులు వేస్తున్నారు. రేపో మాపో వృత్తిపైన కూడా పిచ్చి తుగ్లక్‌లాగా జగన్‌ పన్ను వేస్తాడేమో! నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో టీచర్లు, పోలీసు ఉద్యోగాలు ఇచ్చా. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే జగన్‌రెడ్డి వలంటీర్‌ ఉద్యోగాలతో సరిపెట్టాడు. లక్షా 60 వేల టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీదే. ఇప్పుడు జగన్‌రెడ్డి ప్రకటించిన జాబ్‌ కేలెండర్‌ ఊసెక్కడ? నప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇచ్చానని ప్రకటించి.. ఇప్పుడు 75శాతం హాజరు, 300 యూనిట్లు కరెంటు వాడకం వంటి ఆంక్షలు పెట్టడం మోసం చేయడమే.  


బాబాయిని ఎవరు చంపారు?

జగన్‌ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరో చంపితే నారాసుర రక్త చరిత్ర పేరుతో తన పత్రికలో వార్త రాశారు. ఈ తప్పుడు వార్త రాసినందుకు సాక్షి చైర్‌పర్సన్‌ భారతీ రెడ్డిని అరెస్టు చేయాలి కదా! వివేకా హత్య కేసులో ఆయన సొంత కూతురిపై కేసు పెట్టే అరాచక పరిస్థితి ఉంది. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులపైన కేసు పెట్టేందుకు జగన్‌ పూనుకున్నాడు. సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామరాజును అక్రమంగా అరెస్టు చేసి సీఐడీ అధికారులు విపరీతంగా కొట్టారు. ఇటీవల ప్రధాని కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన ప్రయాణం చేసే రైలునే కాల్చడానికి సిద్ధపడ్డారు. 


నవరత్నాలు కాదు.. నవ ఘోరాలు

రాష్ట్రంలో నవరత్నాలు స్థానంలో నవఘోరాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో జగన్‌రెడ్డి 1.75లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నష్టాలో నడిచిన సాక్షి పత్రిక ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది. మేం అధికారంలోకి వస్తే సీపీఎస్‌ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తాం. సర్పంచులకు కూడా అధికారం, గౌరవం ఇస్తాం.


ఎన్టీఆర్‌ ఒక శక్తి

’’ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. శక్తి, వ్యవస్థ. ఆయన్ను తలచుకుంటేనే ఎక్కడ లేని ధైర్యం, శక్తి వస్తాయి. ఆ శక్తి ముందు అందరూ స్వల్పమే. తెలుగుజాతి గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు మనం వారసులం. చరిత్ర ఉన్నంతవరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. రైతులకు 50 స్లాబ్‌ రేటుకే వ్యసాయ విద్యుత్‌ ఇచ్చిన ఘనత ఆయనదే. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా కార్యక్రమం కింద మినీ మహానాడు నిర్వహిస్తున్నాం. 


రాజంపేట మీ తాత జాగీరు కాదు

మా హయాంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చాం. విత్తనాలు కూడా ఇచ్చా. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనుకున్నా. ఇప్పుడా పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదు. పంటల బీమా కూడా రైతులకు సక్రమంగా ఇవ్వడం లేదు. వైసీపీ నాయకులే దోచుకు తింటున్నారు. వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లయినా చిత్తూరు జిల్లాకు చుక్క నీరు కూడా రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు రౌడీరాజ్యం ఏలుతున్నారు. రాజంపేట పార్లమెంట్‌ మీ తాత జాగీరు కాదు. ఇటీవల తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను హింసించారు. పుంగనూరులో రాజారెడ్డిపై దాడి చేసి కాళ్లు విరిచేశారు. వీటన్నిటికీ వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం. పుంగనూరులోని నేతిగట్టుపల్లెలో 1800 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టు పనులు పెద్దిరెడ్డి కుటుంబమే తీసుకుంది.

Updated Date - 2022-07-07T09:29:35+05:30 IST