సూక్ష్మ భారం.. సారం దూరం

ABN , First Publish Date - 2022-07-21T05:10:09+05:30 IST

సాగులో అధిక దిగుబడులు కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. దిగుబడులే లక్ష్యంగా రసాయనాల విరివిగా వాడుతున్నారు. దీంతో భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది. ఇది భూసారం, పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. అందుకే సూక్ష్మ పోషకాలను వినియోగించాల్సి వస్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూక్ష్మ పోషకాల పంపిణీ నిలిచిపోయింది. కా

సూక్ష్మ భారం.. సారం దూరం

రాయితీకి మంగళం

 ముందే చెల్లిస్తేనే పంపిణీ

 పెదవివిరుస్తున్న రైతులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

సాగులో అధిక దిగుబడులు కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. దిగుబడులే లక్ష్యంగా రసాయనాల విరివిగా వాడుతున్నారు. దీంతో భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది. ఇది భూసారం, పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. అందుకే సూక్ష్మ పోషకాలను వినియోగించాల్సి వస్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూక్ష్మ పోషకాల పంపిణీ నిలిచిపోయింది. కావాల్సిన వారు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లిస్తే రైతు భరోసా కేంద్రాలకు తెప్పిస్తామని అదికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో 2.75 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయనున్నారు. అయితే రానురానూ రసాయనాల వినియోగం పెరుగుతూ వస్తోంది. యూరియా, డీఏపీ, మిశ్రమ రకాలు, ఎంవోపీ, ఎస్‌ఎస్‌పీ, ఇతర సత్తువులను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల్లో వీటి లభ్యత అధికంగా ఉంటే... మరికొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంది. పుడమిలో భూసారం సమతుల్యత దెబ్బతింది. సూక్ష్మ పోషకాలు తగినంతగా ఉండటం లేదు. పంటల కోసం వేలాది రూపాయిలు వెచ్చించి ఆరుగాలం శ్రమించినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఈ సమస్యను గత ప్రభుత్వం గుర్తించింది. ఎక్కడ లోపం ఉందని నిపుణులతో చర్చించారు. మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించాలని అప్పట్లో నిర్ణయించారు. విశ్లేషణ ఫలితాలు వచ్చిన తరువాత ఏం లోపాలు ఉన్నాయని గుర్తించారు. అందుకు అనుగుణంగా 2018 ఖరీఫ్‌లో సమగ్ర పోషకాల యాజమాన్యం (ఐఎన్‌ఎం) పథకం ప్రారంభించారు. రైతులకు ఉచితంగా బోరాన్‌ (ఒక కిలో సంచి), జింక్‌ సల్ఫేట్‌ (10 కిలోలు) జిప్సం (50 కిలోలు) సరఫరా చేసేవారు. ఆయా మండలాల్లోని ఏవో కార్యాలయాలకు పంపించి రైతులకు వంద శాతం రాయితీతో పంపిణీ చేశారు. 2019 రబీలో 50 శాతం రాయితీతో ఇచ్చారు. గత రెండేళ్ళుగా చూస్తే ఉచితం ఊసే లేదు. రాయితీ మాట మరిచారు. రైతులకు కావాల్సిన విత్తనాలు అందజేస్తున్నారు. సాగుదారులు ప్రైవేటు దుకాణాలకు వెళ్లి సొంతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇది కర్షకులపై ఆర్థికంగా భారం పడుతోంది. అయినా తప్పని పరిస్థితుల్లో కొనాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. జింకు సల్ఫేటు, బోరాన్‌, జిప్సం కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి పూర్తి ధర చెల్లిస్తే తెప్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కొన్నింటికే సబ్సిడీ

కొన్నింటికే సబ్సిడీ ఉంది. మిగతా వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కావాల్సిన రైతులు సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. ముందస్తుగా పూర్తి ధర  చెల్లించాల్సి ఉంటుంది. తరువాత డీబీటీ మోడెంలో సబ్సిడీ డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తాం.

- శ్రీధర్‌, జేడీ వ్యవసాయశాఖ, శ్రీకాకుళం.



Updated Date - 2022-07-21T05:10:09+05:30 IST