క్లైమెట్ సమ్మిట్: పర్యావరణ రక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా..

ABN , First Publish Date - 2021-04-23T00:56:32+05:30 IST

పర్యావరణ రక్షణ కోసం అమెరికా నేతృత్వంలో నేడు క్లైమెట్ సమ్మిట్ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

క్లైమెట్ సమ్మిట్: పర్యావరణ రక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా..

న్యూఢిల్లీ: భూతాపం పెంచుతున్న వాతావరణ మార్పులను అరికట్టే దిశగా అమెరికా నేతృత్వంలో నేడు క్లైమెట్ సమ్మిట్ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ హితం కోసం అమెరికా, భారత్‌ ‘ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్‌షిప్’ పేరిట నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు. క్లైమెట్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే..


‘‘సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకున్న అధ్యక్షుడు జో బైడెన్‌కు ధన్యవాదాలు! ప్రస్తుతం మానవాళి కరోనాతో పోరాడుతోంది. ఇక వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ఈ సమావేశం సరైన సమయంలో గుర్తుచేస్తోంది. ఈ మార్పులను మానవాళి అడ్డుకోవాలంటే పటిష్ట చర్యలు అవసరం. జీవన విధానంలో చేయాల్సిన మార్పులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. విస్తృతస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అమిత వేగంతో ఈ చర్యలు చేపట్టాలి. ఈ దిశగా భారత్ తన బాధ్యత నిర్వహిస్తోంది. 2030 కల్లా 450 గీగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని స్థాపించాలని మేము నిర్దేశించుకున్న లక్ష్యమే భారత్ నిబద్ధతకు ఉదాహరణ. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైన్నప్పటికీ.. పర్యావరణ హిత ఇంధన రంగం, అడవుల పెంపకం, జీవవైవిధ్యత వంటి అంశాల్లో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


పర్యావరణ రక్షణ కోసం అమెరికా, భారత్‌ ‘ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్షిప్’ పేరిట ఓ కొత్త భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. ‘‘పర్యావరణం పట్ల బాధ్యతాయుత వైఖరి కలిగిన భారత్ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు సలహాలు , సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది. ఖరీదైన హరిత సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే.. భారత్, అమెరికా ఈ నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పాయి. లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన నిధులు, సాంకేతికత, భాగస్వామ్యాలను రెండు దేశాలు కలిసి సాధిస్తాయి’’ అని మోదీ పేర్కొన్నారు. కాగా.. సమావేశంలో తొలుత ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..అమెరికా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 2030 నాటికల్లా 50 నుంచి 52 మేర కోత విధిస్తామని ప్రకటించారు. 

Updated Date - 2021-04-23T00:56:32+05:30 IST