ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2021-06-12T04:06:57+05:30 IST

మణుగూరుకు గుదిబండలా ఉన్న ఆక్రమణ సమస్య పరిష్కారం కానుంది. మునిసిపాలిటీ కమిషనర్‌ నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో కాలువల మరమ్మతులు చేపట్టిన నాటి నుంచి ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం
ఎక్స్‌కవేటర్‌తో ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం

  • ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభం
  • అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు
  • అధికారులతో వాగ్వాదం
  • పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం
  • మళ్లీ సమయం కోరిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌


మణుగూరుటౌన్‌, జూన్‌ 11: మణుగూరుకు గుదిబండలా ఉన్న ఆక్రమణ సమస్య పరిష్కారం కానుంది. మునిసిపాలిటీ కమిషనర్‌ నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో కాలువల మరమ్మతులు చేపట్టిన నాటి నుంచి ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఎట్టకేలకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. శుక్రవారం ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్‌, కమిషనర్‌ నాగప్రసాద్‌, ఎస్‌ఐ నరేష్‌, ఫైర్‌, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికి సుమారు ఐదు, ఆరు సార్లు కాలువల మరమ్మతులు, ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన అఽధికారులు రాజకీయ, వ్యాపారస్థుల ఒత్తిడి మేరకు నిలిపి వేశారు. ఈ దఫా మాత్రం అధికారులతోపాటు ముంపు ప్రాంత ప్రజలు, వ్యాపారస్థుల్లోని కొందరు ఆక్రమణలను తొలగించాల్సిందేనని పట్టుపట్టడంతో సమస్య పరిష్కారానికి అడుగు పడింది.



తొలగింపు పనులు అడ్డుకున్న కాంగ్రెస్‌..

కాలువను పూర్తిగా ఆక్రమించి నిర్మించిన భవనాన్ని తొలగించేందుకు ఎక్సవేటర్‌తో అధికారులు సిద్ధమవ్వగానే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక సభ్యులైన దోసపాటి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణతో పాటు షాపుల యజమానులు కొంత సమయం ఇవ్వాలని, ఆక్రమణలను తామే తొలగిస్తామని కోరారు. వెంటనే తొలగింపు పనులు చేపట్టాలని, లేని పక్షంలో మేమే ఆ పని చేస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ, మునిసిపల్‌ కమిషనర్‌ తేల్చి చెప్పారు. ఎంతకీ యజమానులు మాట వినకపోవడంతో కూల్చివేత పనులు ప్రారంభించారు.


నిరసన ప్రధర్శనలో ఉన్న కాంగ్రెస్‌ నియోజకవర్గ కన్వీనర్‌ చందా సంతోష్‌ ఆధ్వర్యంలో వ్యాపారస్థులకు మద్దతుగా పనులను అడ్డుకున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ ఈఈ, కమీషనర్‌ మూడురోజుల సమయమిచ్చామని వివరించారు. నాళల ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వ ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం ఆ కమిటీకి లేదని పేర్కొన్నారు. వాగ్వాదం ముదురుతుండటంతో ఎస్‌ఐ నరేష్‌ జోక్యం చేసుకుని సద్దుమణిగించారు.


Updated Date - 2021-06-12T04:06:57+05:30 IST