గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుకు లైన్‌ క్లియర్‌!

ABN , First Publish Date - 2021-11-29T05:23:58+05:30 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుకు పట్టిన గ్రహణం వీడనున్నది. 2015లో రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టిన 22కిలోమీటర్ల రింగ్‌రోడ్డు పనులు ఆరేళ్లలో కేవలం 18 కిలోమీటర్ల మేర పూర్తయింది.

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుకు లైన్‌ క్లియర్‌!
రింగ్‌ రోడ్డు పనులను చేపడుతున్న సిబ్బంది

అదనంగా మరో రూ.120 కోట్లతో టెండర్‌ ప్రక్రియ పూర్తి 

త్వరలో మొదలు కానున్న పనులు 

తొలగనున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు

గజ్వేల్‌, నవంబరు 28: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుకు పట్టిన గ్రహణం వీడనున్నది. 2015లో రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టిన 22కిలోమీటర్ల రింగ్‌రోడ్డు పనులు ఆరేళ్లలో కేవలం 18 కిలోమీటర్ల మేర పూర్తయింది. కాగా ఈ రోడ్డుపై తొమ్మిది రింగ్‌లను నిర్మించాలని భావించగా, ఇప్పటివరకు కేవలం మూడు రింగ్‌లను మాత్రమే పూర్తిచేశారు. ఇంకా నాలుగు కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డుతో పాటు ఆరు రింగ్‌లను నిర్మించాల్సి ఉండగా, ఇందులో భూసేకరణ, కోర్టు కేసుల కారణంగా జాప్యం జరుగుతున్నది. 2015లో ధరలకు, తాజా ధరలకు భారీ వ్యత్యాసం ఉండడంతో గిట్టుబాటు కాదన్న కారణంతో అప్పటి కాంట్రాక్టర్‌ చేతులెత్తే శాడు. దీంతో సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రింగ్‌రోడ్డు పూర్తికాక తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మూడేళ్ల అనంతరం ప్రభుత్వం  తిరిగి రింగ్‌రోడ్డు పనులను పూర్తి చేసేందుకు రీటెండర్‌ పిలిచింది. ఇటీవల ఆగస్టు, సెప్టెంబరులో రూ.118 కోట్లతో ప్రస్తుత ధరలకు అనుగుణంగా టెండర్‌ ప్రక్రియను ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ప్రస్తుతం అగ్రిమెంట్‌ పూర్తి అయి పనులు ప్రారంభం కానున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రింగ్‌రోడ్డు పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పనులను ప్రారంభించడానికి అధికారులు, ఏజెన్సీ సిద్ధమైనట్లు సమాచారం.


 పూర్తయితే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పినట్టే

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిపాలిటీ పరిధిలో గత కొన్నాళ్లుగా ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోయాయి. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన కొండపాక మండ లం ఎర్రవల్లి, సింగారం, తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేములఘాట్‌, లక్ష్మాపూర్‌, బ్రాహ్మణ బంజేరుపల్లి, పల్లెపహాడ్‌ గ్రామాలు మునిసిపాలిటీ పరిధిలోకి చేరడంతో అనూహ్యంగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో రింగ్‌రోడ్డు నిర్మాణం ప్రస్తుతం అనివార్యంగా మారింది. భారీ వాహనాలు పట్టణంలోకి ప్రవేశించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న పనులు

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు భూసేకరణలో పలువురు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంవల్లే రింగ్‌రోడ్డు పనులు పెండింగ్‌లో పడినట్టు తెలుస్తున్నది. ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌లో దాదాపు 10 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉండడం, ఈ భూమి విషయమై భూ యజమానులు కోర్టులను ఆశ్రయించగా, అధికారులు పెండింగ్‌లో ఉన్న పలువురు  భూయజమానులకు సంబంధించిన డబ్బును కోర్టులో డిపాజిట్‌ చేసినట్లు తెలిసింది.  ప్రజ్ఞాపూర్‌ నుంచి శ్రీగిరిపల్లి, రిమ్మనగూడ శివార్లలో రాజీవ్‌రహదారిలో అంతర్భాగంగా ఏడు కిలోమీటర్ల మేర 150 ఫీట్ల వెడల్పుతో ఆరు లైన్ల రోడ్డు నిర్మించాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే ఐదున్నర కిలోమీటర్ల మేర పూర్తయింది. మిగిలిన విస్తీర్ణంలో భూసేకరణ పూర్తికాకపోవడంతో పెండింగ్‌లో పడింది. కోర్టులో భూనష్టపరిహారం డిపాజిట్‌ చేసినందున పనులకు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని తెలుస్తున్నది.  

Updated Date - 2021-11-29T05:23:58+05:30 IST