పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ABN , First Publish Date - 2020-05-25T09:58:15+05:30 IST

వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలోని పూల కుండీలను శుభ్రం చేశారు. ఇంటి ఆవరణంలోని పిచ్చిమొక్కలను తొలగించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో పురపాలక శాఖ ఇప్పటికే ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించి, ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కరోనా నేపథ్యంలో అలవాటైన వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించాలన్నారు. రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 


క్లీన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయాలి

మేడ్చల్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం నిర్వహించే క్లీన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కోరారు. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు మంత్రి తన నివాసంలో పూల మొక్కల మధ్య చెత్తా, చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రపర్చుకోవాలన్నారు. డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు, చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, విధిగా నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఇంటి ముందు వెనుక పగిలిన కుండలు, డబ్బాలు, డ్రమ్ముల్లో నిలిచిన నీటిని ఖాళీ చేయాలని తెలిపారు. ఇంటికి సంబందించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకును శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని సూచించారు. 

Updated Date - 2020-05-25T09:58:15+05:30 IST