పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత

ABN , First Publish Date - 2020-06-06T10:12:38+05:30 IST

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని వ్యవసాయ శాఖ మంత్రి

పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత

పారిశుధ్య కార్మికులు, వైద్యుల సేవలు ఎనలేనివి

వాళ్లకు పాదాభివందనం చేసినా తక్కువే

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మునిసిపల్‌ కార్మికులతో కలిసి సహపంక్తి బోజనం చేసిన మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ


వనపర్తి అర్బన్‌, జూన్‌ 5 : ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద శుక్రవారం మంత్రి మునిసిపల్‌ కార్మికులతో పాటు కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ అపూర్వరావులతో కలిసి సహపంక్తి బోజనం చేశారు. అంతకు ముందు మునిసిపల్‌ కార్మికులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో మునిసిపల్‌ కార్మికులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి విధులు నిర్వహించారని, వారితో పాటు డాక్టర్ల సేవలు కూడా ఎనలేనివని అన్నారు. వారందరికీ పాదాభివందం చేసినా తక్కువేనని వారి సేవలను కొనియాడారు.


కార్మికులు కూడా మనుషులేనని, పరిసరాల పరిశుభ్రత బాధ్యత పూర్తిగా వాళ్ల మీదనే వదిలేయకుండా మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకొని వారికి సహకరించాలని మంత్రి  సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క శాఖ సమన్వయంతోనే వనపర్తి జిల్లా గ్రీన్‌ జోన్‌గా ఉందన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఈ పది రోజుల్లో 40 లక్షల మొక్కలను హారితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు సిద్ధం చేశామని, త్వరలో కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని అన్నారు.


పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మిక్రమంపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించి తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్ష్మయ్య, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:12:38+05:30 IST