స్వచ్ఛ సర్వేక్షణ్‌ భేష్‌!

ABN , First Publish Date - 2022-01-19T05:54:20+05:30 IST

పల్లెల్లో ప్రభుత్వ పథకాల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రభుత్వం, అధికారులు తీసుకుంటున్న చర్యలను రాబట్టేందుకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ సర్వే చేపట్టింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ భేష్‌!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో మూడు రోజుల పాటు కొనసాగిన సర్వే

రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి/మెదక్‌,జనవరి17: పల్లెల్లో ప్రభుత్వ పథకాల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రభుత్వం, అధికారులు తీసుకుంటున్న చర్యలను  రాబట్టేందుకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ సర్వే చేపట్టింది. ఐదోవిడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కార్యాచరణను  ఈనెల 11, 12, 13 తేదీల్లో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో చేపట్టారు. సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్య సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల నిర్వహణ, తదితర అంశాలపై పరిశీలన జరిపారు.  ఈసారి మరుగుదొడ్ల నిర్వహణను ప్రధాన అంశంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలోని నివేదికను ప్రభుత్వం త్వరలో కేంద్రానికి పంపనున్నది. 

  ‘‘స్వచ్ఛసర్వేక్షణ్‌ సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో బాగుంది. స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరిస్తున్నారు.’’ ఎంపిక చేసిన గ్రామాల్లో ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవమిది. స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) జిల్లాగా సంగారెడ్డిని గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామాల్లో బహిరంగ మల మూత్రవిసర్జన జరగడం లేదని జిల్లాయంత్రాంగం ఇది వరకే ప్రకటించింది. ఇందులో 166 గ్రామాలైతే ఓడీఎఫ్‌ ప్లస్‌గా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో ప్రజలకు టాయిలెట్లు, డంప్‌యార్డులు, డ్రైయినేజీలు, శానిటేషన్‌ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉన్నాయి. అయితే జిల్లాలోని గ్రామాల్లో ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా? లేవా? వీటిని ప్రజలు వినియోగిస్తున్నారా? లేదా? దగ్గర్లో నీటి వనరులు ఉన్నాయా? అని కేంద్రం పలు అంశాలను సూచిస్తూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అం దులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని  647 గ్రామాలకు గాను 39 గ్రా మాలను,  మెదక్‌ జిల్లాలో 429 గ్రామాలకుగాను 27 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేశారు.  


మూడు రోజుల పాటు జరిగిన సర్వే

ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కార్యాచరణను సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన 39 గ్రామాల్లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో సర్వే నిర్వహించారు. ఎంపీడీవో, ఎంపీవోలతో పాటు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి ఈ సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన గ్రామాల్లోనూ 20 ఇళ్లను మాత్రమే అదికారులు సర్వేకు తీసుకున్నారు. అందులో ఎస్సీల ఇళ్లు 30శాతం, ఎస్టీల ఇళ్లు 20 శాతం, ఇతరుల ఇళ్లు 50శాతం ఉండేలా చూసుకున్నారు. అలాగే మెదక్‌ జిల్లాలో 429 గ్రామాలు ఉండగా అందులో 27 గ్రామాలను ఎంపిక చేశారు. అల్లాదుర్గం మండలం చేవేళ్ల, చేగుంట మండలం పోతన్‌శెట్టిపల్లి, చిలి్‌పచెడ్‌ మండలం గుజిరితాండ, హవేళిఘణపూర్‌ మండలం శమ్నాపూర్‌, కౌడిపల్లి మండలం బుజరంపేట్‌, మహమ్మద్‌నగర్‌, సలావత్‌పూర్‌, కొల్చారం మండలం కొంగోడ్‌, పోతిరెడ్డిపల్లి, మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి, కోనాయిపల్లి, మెదక్‌ మండలం బాలానగర్‌, నర్సాపూర్‌ మండలం తుల్జారంపేట్‌, నార్సింగి మండలం భీమ్‌రావ్‌పేట్‌, నిజాంపేట మండలం తప్పన్నగుళ్ల, పాపన్నపేట మండలం సీతానగర్‌, రామాయంపేట మండలం సుతార్‌పల్లి, రేగోడ్‌ మండలం పోచారం, పెద్దశంకరంపేట మండలం ఆరేపల్లి, చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట్‌, తుర్కలమందాపూర్‌, శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల, టేక్మాల్‌ మండలం బోడదత్‌, తూప్రాన్‌ మండలం కోనాయిపల్లి, మల్కాపూర్‌, వెల్దుర్తి మండలం మహమ్మద్‌నగర్‌ తండాల్లో సర్వే నిర్వహించారు. ఆయా ఇళ్లకు వెళ్లిన అధికారుల బృందం ‘‘మీ ఇళ్లలో టాయ్‌లెట్లు ఉన్నాయా? వినియోగిస్తున్నారా? ఇంకుడు గుంత ఉన్నదా? గ్రామంలో డంప్‌యార్డు ఉన్నదా? డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తున్నదా?’’ అన్న అంశాలపై ఆయా ఇళ్లలో ఉంటున్న వారి నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈసర్వేలో ప్రజలందరూ తమ ఇళ్లలో టాయిలెట్లు ఉన్నాయని, వాటిని వినియోగిస్తున్నామని, ఇళ్లలో ఇంకుడు గుంతలు కూడా ఉన్నాయని తెలిపారు. గ్రామంలో డంప్‌యార్డు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉందని పేర్కొన్నారు. 


2, 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక

స్వచ్చసర్వేక్షణ్‌లో భాగంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించనున్నది. ఆ తర్వాత కేంద్రబృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా అంశాలపై సర్వే నిర్వహించి, వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా స్వచ్చ సర్వేక్షణ్‌ అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. 



Updated Date - 2022-01-19T05:54:20+05:30 IST